పచ్చగద్దలు! | - | Sakshi
Sakshi News home page

పచ్చగద్దలు!

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

పంచదార్ల కొండపై
రాత్రింబవళ్లు యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలు నంబరు ప్లేట్లు లేని టిప్పర్లలో గ్రావెల్‌ తరలింపు
ఎంపీ సీఎం రమేష్‌ ఆధ్వర్యంలోనే అక్రమ మైనింగ్‌ అంటూ ఆరోపణలు కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసులు పెడతామంటూ పోలీసుల బెదిరింపులు గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే పనుల కానిచ్చేస్తున్న వైనం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

నీసం గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పంచదార్ల కొండపై జోరుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కు అభివృద్ధి కోసమంటూ అధికారులు ఈ మైనింగ్‌ అనుమతులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ ఎలా చేపడతారంటూ స్థానిక గ్రామస్తులు ప్రశ్నిస్తుంటే.. రాంబిల్లి పోలీసులు వారిపై తిరగబడి కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ అండదండలతోనే తాము మైనింగ్‌ చేపడుతున్నామని, ఎవరైనా అడ్డు వస్తే లారీలతో తొక్కించేస్తామని మైనింగ్‌ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు స్వయంగా కూటమికి చెందిన స్థానిక నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పంచదార్లలోని ప్రాచీన శైవక్షేత్రంతో పాటు, పురావస్తు శాఖ పరిధిలోని బౌద్ధారామాలకు కూడా ఈ అక్రమ మైనింగ్‌ వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా కొండ దిగువన ఉన్న చారిత్రక రిజర్వాయర్‌ సైతం ఎండిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు ‘పంచదార్ల కొండపై మైనింగ్‌ జరగనివ్వం’ అని హామీ ఇచ్చిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు దీనిపై ఏం సమాధానం చెప్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తే.. ‘తనకేమీ తెలియదు’ అంటూ దాటవేస్తున్నారని వారు వాపోతున్నారు. సీఎం రమేష్‌ పేరు చెప్పుకుంటూ ప్రాచీన బౌద్ధారామాలకు, శైవక్షేత్రానికి నష్టం కలిగిస్తున్న ఈ అక్రమ మైనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని స్థానికులు బలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

శైవ క్షేత్రానికి ముప్పు..!

పంచదార్ల వద్ద పూర్వం స్వయంభూ లింగం ఉండేదని, కాలక్రమేణా అది మరుగున పడిపోవడంతో నారద మహర్షి సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టు వ్యాధి నివారణ కోసం ఇక్కడ మరో లింగాన్ని ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయానికి ‘ధర్మలింగేశ్వరాలయం’ అనే పేరు వచ్చింది. ఇక్కడి కోనేట్లోని లింగాల నుంచి నిరంతరం ప్రవహించే నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది నేటికీ ఒక రహస్యమే. ఈ పుణ్యతీర్థాన్ని సేవిస్తే అనారోగ్యాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి మొదటిసారిగా ఇక్కడే పాదాలు మోపారని కూడా ప్రతీతి. ఇక్కడి మండపంలో చప్పట్లు కొడితే ఆ శబ్దం తిరిగి ప్రతిధ్వనించడం మరో ప్రత్యేకత. ఇన్ని విశిష్టతలు ఉన్నందున, దీనిని పురాతన రక్షిత కట్టడంగా గుర్తిస్తూ పురావస్తు శాఖ ఇక్కడ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సాగుతున్న ఈ భారీ అక్రమ మైనింగ్‌ వల్ల ఈ శైవక్షేత్రం ఉనికికే ముప్పు వాటిల్లుతోంది. దీనికి తోడు ఈ కొండకు ఆనుకుని ఉన్న ఫణిగిరి కొండపై గల బౌద్ధారామాలు కూడా మైనింగ్‌ దెబ్బకు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని చరిత్రకారులు ఆందోళన చెందుతున్నారు.

చారిత్రక జలధారకూ గండం..!

కొండ నుంచి సహజసిద్ధంగా ప్రవహించే నీటితో కొండ కింద దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఒక రిజర్వాయర్‌ ఏర్పడింది. బ్రిటిష్‌ కాలం నాటి ఈ రిజర్వాయర్‌ను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారు. 2023లో ’ఏషియన్‌ పెయింట్స్‌’ సీఎస్సార్‌ నిధులతో అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఈ రిజర్వాయర్‌ను ఆధునీకరించి, ఎక్కువ నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతంలో వెంకటాపురం రెవెన్యూ పరిధిలో ఉపాధి హామీ నిధులతో కొండ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు జరిగేవి. కానీ, ప్రస్తుత అక్రమ మైనింగ్‌ కారణంగా ఈ సహజ జలధారలు పూడిపోయి, రిజర్వాయర్‌ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి తోడు, కొండపై మైనింగ్‌ సాగుతుండటంతో ఉపాధి హామీ పనులు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ ఫొటోలో ఉన్నది పంచదార్ల కొండ. అటు వెంకటాపురం నుంచి ఇటు పంచదార్ల వరకూ విస్తీరించి ఉన్న ఈ కొండ బహుశా రాష్ట్రంలోనే అతిపెద్ద కొండగా గుర్తింపు పొందింది. పచ్చదనంతో కళకళలాడే పంచదార్ల కొండపై పచ్చగద్దలు వాలి అడ్డంగా తొలిచేస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement