భద్రత గాలికొదిలేసిన వైనం
విజిలెన్స్ పర్యవేక్షణ ఉండగానే
ఆలయంలో చోరీ
సుమారు రూ.4లక్షలు చోరీ జరిగిందన్న అనుమానాలు
ఉపమాక వెంకన్నపై
నక్కపల్లి : ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ది గాంచిన ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంపై తిరుమల తిరుపతి దేవస్దానం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో సీసీ కెమెరాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ గార్డుల భద్రత ఉన్న ఆలయంలో మంగళవారం ఆర్ధరాత్రి చోరీ జరగడం గమనార్హం. రాత్రి ఒంటి గంట సమయంలో ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు ఆలయం వెనుక ఉన్న కొండపై నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్న మామిడి చెట్లు ద్వారా ఆలయంలోకి కట్టర్లతో ప్రవేశించి రెండు హుండీలను కొల్లగొట్టారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన లక్షలాది రూపాయల నగదును, బంగారు వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు.
చోరీ సొమ్ము రూ.4లక్షల పైనే...
దేవస్థానం అధికారులు చోరీకి గురైన సొమ్ము రూ.1.50 లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నప్పటికీ దుండగులు ఎత్తుకుపోయింది సుమారు రూ.4 లక్షలు పైనే ఉంటుందన్న అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. హుండీలో మూటకట్టి ఉంచిన సుమారు రూ.20లక్షలు విలువ చేసే 56 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కిలోల 70 గ్రాముల వెండి ఆభరణాలను కొండ వెనుక తోటలో వదిలేశారు. పట్టుకుపోయే సమయంలో మూట జారిపడిపోయిందా, లేక దొరికిపోతాం ఆనే భయంతో వదిలేశారా అనేది తెలియడం లేదు. దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాలు ఈ మూటను ఆలయం వెనుక ఉన్న కొండ ప్రాంతంలో గుర్తించాయి. దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయాన్ని 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్దానం వారికి అప్పగించింది. ఆలయానికి ఏటా సుమారు రూ.40 లక్షల ఆదాయం లభిస్తుంది.
ఆభరణాల భద్రతలో టీటీడీ నిర్లక్ష్యం
ఆలయంలో ఐదు హుండీలు ఉన్నాయి. కొండపైన రెండు, కొండ దిగువన మూడు ఉన్నాయి. ప్రతి మూడు నెలలకొకమారు హుండీలను తెరిచి వాటిలో ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలను లెక్కించి భద్రపరచాల్సి ఉంటుంది. టీటీడీ ఆదీనంలోకి వచ్చిన తర్వాత స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను టీటీడీ వారు నగదును మాత్రమే తీసుకెళ్లి ఆభరణాలను ఇక్కడే వదిలేస్తున్నారు. ఇలా ఐదారేళ్లనుంచి వచ్చిన ఆభరణాలను మూటగట్టి ఇక్కడ హుండీల్లోనే ఉంచడం జరుగుతోంది. ఆభరణాలను టీటీడీకి చెందిన ఇన్వెంటర్ వచ్చి తనిఖీ చేసి నిర్దారించిన తర్వాత తిరుపతిలో ఉన్న మింట్‌లో భద్రపరుస్తారు. కానీ టీటీడీకి చెందిన ఇన్వెంటర్ ఐదారేళ్ల నుంచి రాకపోవడంతో కానుకల రూపంలో వచ్చిన ఆభరణాలను స్థానిక సిబ్బంది లెక్కించి మూటగట్టి హుండీల్లో వేసేస్తున్నారు. చోరీ జరిగిన రాత్రి టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు గార్డులు ఒకరు సీసీ కెమెరాలు ఉన్న గదిలోను మరొకరు ఆలయం బయట పడుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి గంటకు ఆలయ పరిసరాలను పరిశీలించి పొజిషిన్ పీస్‌ఫుల్ అంటూ తిరుమలలో ఉన్న విజిలెన్స్ విభాగానికి వాట్సాప్ మెసేజ్ పంపాల్సి ఉంటుంది. అయితే మంగళవారం రాత్రి చోరీ జరిగితే ఇక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బంది తెల్లవారు జామున నాలుగు గంటలకు పొజిషిన్ పీసుఫుల్ అంటూ విజిలెన్స్ విభాగానికి మెసెజ్ పంపించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం ఉదయం ఆలయంలోకి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది హుండీలు తెరచి ఉండడాన్ని గుర్తించి ఆలయ అధికారులకు, అర్చకులకు సమాచారం ఇచ్చారు. మూడు షిప్టుల్లో సుమారు ఆరుగురు సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు.
ఆలయ ఇన్‌స్పెక్టర్ వైఖరిపై విమర్శలు
ఇక్కడ ఆలయ ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరిస్తున్న కూర్మేశ్వరరావు వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదారేళ్లుగా కానుకల రూపంలో వచ్చిన ఆభరణాలను ఏ హుండీలో ఽభద్రపరిచారన్నది ఆయన స్పష్టంగా చెప్పలేకపోవడం విశేషం. ఆస్థాన మండపంలో ఉన్న హుండీలోనా లేక ఉత్సవమూర్తులున్న గర్భాలయంలో ఉన్న హుండీలో వేశారా? అనేది చెప్పలేకపోతున్నారు. ఆస్దాన మండపంలో చోరీ జరిగిన హుండీలోనే వేసినట్లు గుర్తని చెప్పడం గమనార్హం. విధి నిర్వహణలో ఇన్‌స్పెక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


