కన్నకొడుకు అంత్యక్రియలకు నిందితుడికి అనుమతి | - | Sakshi
Sakshi News home page

కన్నకొడుకు అంత్యక్రియలకు నిందితుడికి అనుమతి

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

● ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య హాజరైన తండ్రి ● మానవత్వం చాటుకున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఎస్పీ తుహిన్‌ సిన్హా ప్రత్యేక చొరవతో గంజాయి కేసులో నిందితుడైన వ్యక్తిని ఒక రోజు పెరోల్‌పై జైలు నుంచి విడుదల చేశారు. వి.మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు(అలియాస్‌ మహాలక్ష్మీనాయుడు) గంజాయి రవాణా కేసులో నిందితుడు. ఈ ఏడాది జనవరి 12వ తేదీ నుంచి విశాఖ సెంట్రల్‌ జైలులో ఉంటున్నాడు. రాజు పెద్ద కుమారుడు పెచ్చేటి సాయి కిరణ్‌ (17) గత నెల 31వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎస్పీకి లిఖితపూర్వకంగా సమాచారాన్ని తెలియజేయడంతో మానవతా దృక్పథంతో ఒకరోజు తాత్కాలిక బెయిల్‌ (పెరోల్‌) మంజూరు చేయించారు. ఈనెల 3వ తేదీన జరిగిన కుమారుడు అంత్యక్రియలకు రాజు హాజరయ్యాడు. మూడేళ్ల క్రితమే రాజు చిన్న కుమారుడు జితేంద్ర అనారోగ్యంతో మరణించగా, ఇప్పుడు పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్త జైలులో ఉండి, ఇద్దరు కొడుకులు దూరమవడంతో రాజు భార్య లక్ష్మి శోకసంద్రంలో మునిగిపోయింది.

పోలీసుల తక్షణ స్పందన

కన్నకొడుకు చివరి చూపుకై నా తండ్రిని తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు వి.మాడుగుల ఎస్‌ఐ నారాయణ రావు, కె.కోటపాడు సీఐ కృష్ణను కోరగా ఈ విషయాన్ని ఎస్పీ తుహిన్‌ సిన్హా , అదనపు ఎస్పీ ఎల్‌.మోహన రావుకు వారు నివేదించారు. పరిస్థితి తీవ్రతను, కుటుంబంలోని విషాదాన్ని గమనించిన ఎస్పీ మానవత్వంతో స్పందించి, హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ నెల 2న అత్యవసరంగా జీవో జారీ చేస్తూ, నిందితుడు పెచ్చేటి రాజును కారాగారం నుంచి ఒక రోజు తాత్కాలిక విడుదల చేసింది.దీంతో తగిన పోలీస్‌ భద్రత నడుమ రాజు జంపెన గ్రామానికి చేరుకుని, తన కుమారుడు సాయి కిరణ్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మానవతా దృక్పథంతో స్పందించి, కన్నకొడుకును ఆఖరిసారి చూసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు పోలీస్‌శాఖకు రాజు, మృతుడి తల్లి లక్ష్మి, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంత్యక్రియలు అనంతరం రాజును సాయంత్రం పోలీస్‌లు విశాఖ సెంట్రల్‌ జైల్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement