పత్రాలు లేని 21 బైక్‌లు, 2 కార్లు స్వాధీనం
గ్రామాన్ని జల్లెడ పట్టిన పోలీసులు
గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
డీఎస్పీ పి.శ్రీనివాసరావు
నర్సీపట్నం: ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామంలో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్‌ఐలు రాజారావు, దామోదర్‌నాయుడు, తారకేశ్వరరావు, రామారావు, రిషికేశ్వరరావు, 70 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 21 బైక్‌లు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తాగుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టారు. గ్రామస్తులను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, సహకరించినా వారిపై కఠినమైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే టోల్ ప్రీ నెంబర్ 1972, 112, 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అందించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు.


