పెద్దకొండపై అక్రమాల రంగులు! | - | Sakshi
Sakshi News home page

పెద్దకొండపై అక్రమాల రంగులు!

Jun 3 2026 12:33 AM | Updated on Jun 3 2026 12:33 AM

150 ఎకరాల ప్రభుత్వ భూమిపై గద్దల్లావాలిన అధికార పార్టీ నేతలు

సరిహద్దుల కోసం రంగు రంగుల రాళ్లు..బినామీల పేర్లతో నకిలీ రికార్డులు

రెవెన్యూ అధికారులకూ భారీగా వాటాలు..

కొండను పంచుకున్న కూటమి నేతలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామ పరిధిలోని పెద్దకొండపై జరుగుతున్న అక్రమ వ్యవహారాలకు రంగురంగుల రాళ్లే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వన్యప్రాణులు సంచరించే ఈ కొండను కూటమి నేతలు ముక్కలుగా పంచుకుని, తమకు కేటాయించుకున్న భూభాగాలకు రంగు రాళ్లతో సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమిగా ఉన్న ప్రాంతంలో ప్రైవేటు సర్వేలు నిర్వహించి, సొంత మ్యాపుల ఆధారంగా హద్దులు నిర్ణయించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అంతేకాదు, సర్వే నిర్వహణ కోసం అడవిలో చెట్లను నరికి, కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా దారులు కూడా ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ స్థాయిలో కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రూ.450 కోట్ల భూ దోపిడీ.. అధికారులకూ వాటాలు

భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండల పరిధిలోని శొంఠ్యాం గ్రామ సర్వే నంబర్లు 346, 347 లలో సుమారు 469.9 ఎకరాల ప్రభుత్వ భూమి విస్తరించి ఉంది. స్థానికంగా దీనిని ‘పెద్దకొండ’గా పిలుస్తారు. అదానీ డేటా సెంటర్‌ ప్రతిపాదిత ప్రాంతానికి ఎదురుగా ఉండటంతో పాటు, కొండ దిగువన ఇప్పటికే వీఎంఆర్‌డీఏ భూసమీకరణ చేపట్టి రైతులకు ప్లాట్లు పంపిణీ చేయడంతో ఈ ప్రాంతానికి భారీగా విలువ పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి విలువ కనీసం రూ.3 కోట్ల పైమాటే. మొత్తం 469.9 ఎకరాల్లోని అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని కాజేసేందుకు కూటమి నేతలు స్కెచ్‌ వేశారు. ఈ భారీ స్కామ్‌ సాఫీగా సాగడం కోసం ఒక రెవెన్యూ ఉన్నతాధికారికి 16 ఎకరాలు, ఒక ప్రైవేటు సర్వేయర్‌కు 5 ఎకరాలు, ఇతర రెవెన్యూ సిబ్బందికి తలా 5 ఎకరాల చొప్పున బినామీ పేర్లతో రికార్డులు సృష్టిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌, ఇద్దరు ఎమ్మెల్యే పీఏల ఆధ్వర్యంలోనే నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

‘రంగు’ల ఆట.. ప్రైవేటు వేట!

సాధారణ ప్రజలు, రైతులు కూడా వెళ్లడానికి సాహసించని ఈ కొండపై కూటమి నేతలు డ్రోన్ల సహాయంతో ప్రైవేట్‌ సర్వే పూర్తి చేశారు. ఏ నేతకు ఏ రంగు రాయి నుంచి ఏ రంగు రాయి వరకు భూమి ఉందో నిర్ధారించుకుంటూ రంగుల రాళ్లతో సరిహద్దులు గీసుకున్నారు. అక్రమాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్న ఈ రంగు రాళ్లు కొండపై స్పష్టంగా కనిపిస్తున్నా.. తమకు వాటాలు అందడంతో రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. బినామీల పేర్లతో నకిలీ ‘డీ–పట్టా’లు సృష్టించి, తామే కొన్నేళ్లుగా సాగు చేస్తున్నట్లు రికార్డులు మార్చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది.

బినామీల ఖాతాల్లోకి భారీగా జమ..!

రైతుల నుంచి కారుచౌకగా భూములు లాక్కునేందుకు ఒప్పందాల పేరిట పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోంది. కార్పొరేషన్‌ చైర్మన్‌ బినామీగా ఉన్న స్థానిక నేత ఎస్‌బీఐ ఖాతాలోకి గత 3, 4 నెలల్లోనే రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు జమ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మార్కెట్‌లో కోట్లు పలికే రైతుల డీ–పట్టా భూములను ఎకరా కేవలం రూ.18 లక్షలకే కొనుగోలు చేసేలా బెదిరించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందుకు అడ్వాన్స్‌గా ఎకరాకు రూ.2 లక్షల చొప్పున రైతులకు ఇస్తున్నారు. బినామీలుగా వ్యవహరిస్తున్న జనసేన, టీడీపీకి చెందిన నేతల గత ఐదారు నెలల బ్యాంక్‌ ఖాతాలను నిష్పాక్షికంగా పరిశీలిస్తే ఈ మెగా భూదోపిడీ గుట్టు రట్టవుతుందని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

అధికారుల మౌనంపై ప్రశ్నలు

ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు సర్వేలు, డ్రోన్‌ మ్యాపింగ్‌, చెట్ల నరికివేత, హద్దుల గుర్తింపు, నడక దారుల ఏర్పాటు వంటి చర్యలు బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, గత కొద్ది నెలలుగా సంబంధిత వ్యక్తుల బ్యాంకు లావాదేవీలు, భూ రికార్డులు, సర్వే వివరాలను పరిశీలిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

స్థానిక రైతుల నోట్లో మట్టి!

కూటమి నేతల భూదాహం అంతటితో ఆగలేదు. కొండపై ప్రభుత్వ భూమిని మింగేస్తూనే.. కొండ కింద దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతుల భూములపై పడ్డారు. వాస్తవంగా రైతుల సాగులో ఉన్న 50 ఎకరాల విస్తీర్ణాన్ని రికార్డుల్లో తగ్గించి, ఆ భూమిని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జనసేనకు చెందిన ఒక ‘మూర్తీ’భవించిన నేతతో పాటు, కార్పొరేషన్‌ చైర్మన్‌కు బినామీగా ఉన్న ఒక టీడీపీ నేత కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్రమాల్లో ‘రాంబాబు’గా పేరొందిన వ్యక్తికి, ఈ బినామీల ‘రమణీ’య పాత్ర వెన్నుదన్నుగా నిలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement