అంగరంగ వైభవంగా మోదకొండమ్మ పండగ | - | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా మోదకొండమ్మ పండగ

Jun 3 2026 12:33 AM | Updated on Jun 3 2026 12:33 AM

మాడుగుల : మాడుగుల మోదకొండమ్మ పండగ మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని పూలు నగలతో ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారు 4 గంటల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రతి రూపమైన ఘటాలు శిరస్సున పెట్టుకుని ఆలయానికి కాలి నడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడానికి కిలోమీటర్ల మేర బారులు తీరారు. మాడుగుల రాజవంశీకురాలు మాయాంక కుమారి దేవ్‌ వారి ఇంటి ఇలవేల్పుగా భావించే దేవత మోదకొండమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజుతో పాటు ఇతర కమిటీ సభ్యులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎంపీపీ రామధర్మజ, కమిటీ సభ్యులు దేవరాపల్లి శ్రీనివాసరావు, దంగేటి సూర్యారావు, భీమరశెట్టి పైడినాయుడు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు. పండగ సందర్భంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, సత్యహరిశ్చంద్ర నాటకం ఆకట్టుకున్నాయి. బొమ్మల కొలువులు, రంగుల రాట్నాలు చిన్నారులను ఆకట్టుకున్నాయి.

అమ్మవారి ఘటాల ఊరేగింపు

అమ్మవారి ప్రతిరూపమైన ఘటాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆలయ కమిటీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, ఇతర కమిటీ సభ్యులు శిరస్సున పెట్టుకుని సంబరంలో అడుగుల వేశారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ప్రతిష్టించి తీన్‌మార్‌, సన్నాయి వాయిద్యాలు, మహిళల కోలాటాలు, శక్తి వేషాలు, బళ్లవేషాలు నడుమ సంబరంగా ఊరేగించారు. ఈ సందర్భంగా మోదమాంబ లక్ష్మీ వర్తక సంఘం భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. మోదకొండమ్మ సేవక బృందం సభ్యులు ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు.

గట్టి పోలీసు బందోబస్తు

జాతర సందర్భంగా ఎస్‌ఐ జి నారాయణరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 250 మంది సిబ్బందితో అమ్మవారిని సులువుగా దర్శించుకునే విధంగా వాతావరణం కల్పించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సంబరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అమ్మవారి దర్శనానికిబారులు తీరిన భక్తులు

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

అమ్మవారిని దర్శించుకున్నమాడుగుల రాజ వంశీకురాలు మయాంక కుమారిదేవ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement