బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాదిలో తాగునీటి కోసం మహిళలు సచివాలయం ముట్టడించారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సచివాలయంలో బైఠాయించి తాగునీరు అందించి ఆదుకోండి అంటూ నిరసన చేపట్టారు. ఎండాకాలం గుక్కెడు నీళ్లు అందక తీవ్ర అవస్థలు పడుతున్నాం...అధికారులూ మా గోడు పట్టించుకోండి..నీళ్లు ఇచ్చి ఆదుకోండి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా 9వ వార్డులో 6 నెలలుగా మంచినీళ్లు సక్రమంగా రావడం లేదు. పలువురు అనధికారికంగా మోటార్లు బిగించి ట్యాంకులకు ఎక్కించి నీటిని మళ్లిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని, కుళాయి నుంచి బిందెడు నీళ్లు కూడా రావడం లేదని గ్రామానికి చెందిన సుంకరి లక్ష్మి, వెలుగుల రత్తమ్మ, వీర్ల శ్యామ్‌రాజ్, గండ్రెడ్డి లక్ష్మి, దూళ్ల పార్వతమ్మ, అరిశంకల లక్ష్మి, అదట్రా లక్ష్మి, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు శిరిగిరిశెట్టి దొరపిల్ల తదితరులు పంచాయతీ ఈవో రామలింగేశ్వరరావును నిలదీశారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులైతే ఏ నాడు మా గ్రామంలో పర్యటించరని ప్రజలకు సురక్షతమైన తాగునీరు అందుతుందా లేదా ప్రజలకు నీరు అందుతుందా లేదా, మంచినీటిని క్లోరినేషన్ చేశారా లేదా అన్నది పరిశీలించరని జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు చిన వెంకయ్యదొర ఆరోపించారు. గతంలో పని చేసిన అధికారులతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న అధికారుల తీరు బాగోకపోవడంతోనే సచివాయం ముట్టడించాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. తక్షణం అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఖాళీ బిందెలతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


