దగా బాబు..
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన గళం నెహ్రూచౌక్ జంక్షన్‌లో మానవహారం, కలెక్టరేట్ ముట్టడి 5 కిలోమీటర్ల మేర భారీ కార్లు, బైక్ ర్యాలీ పోలీసుల ఆంక్షల నడుమ కలెక్టరేట్ వద్ద ధర్నా భారీగా తరలివచ్చిన యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
మాట్లాడుతున్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చిత్రంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్, మాజీ ఎంపీ సత్యవతి
బాబు తొలి సంతకమే ‘మెగా అక్రమం’ :
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, అనకాపల్లి : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ’మెగా డీఎస్సీ’ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ’మెగా మోసం’గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిన తొలి సంతకంలోనే భారీ అక్రమాలు, దగా దాగున్నాయని మండిపడింది. ఈ దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు సమరభేరి మోగించాయి. నెహ్రూచౌక్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు, ముట్టడి కార్యక్రమాలతో అనకాపల్లి అట్టుడికింది. ఈ నిరసన ప్రదర్శనలో జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగ యువత, టెట్, డీఎస్సీ అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొని నిరసనను విజయవంతం చేశారు.
మిన్నంటిన నినాదాలు
దగా డీఎస్సీపై నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం పిలుపునిచ్చిన ఈ నిరసన కార్యక్రమం హిట్ అయింది. నెహ్రూచౌక్ జంక్షన్ వద్ద ఉదయాన్నే వందల మంది యువకులు, అభ్యర్థులు, పార్టీ నాయకులు తరలివచ్చారు. అక్కడ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని భారీ మానవహారంగా ఏర్పడి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నినదించారు. అనంతరం అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర భారీ సంఖ్యలో కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. వందలాది వాహనాలతో సాగిన ఈ ర్యాలీతో రహదారులన్నీ వైఎస్సార్‌సీపీ జెండాలు, నిరసన ప్లకార్డులతో నిండిపోయాయి. ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. డీఎస్సీ అక్రమాపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు.
పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట సమన్వయకర్తలు అన్నపరెడ్డి అదీప్‌రాజు, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు మాట్లాడుతూ పరీక్షల సమయంలో విశాఖలో విద్యుత్ నిలిపివేసి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారని, పేపర్ లీకేజీలు జరిగాయని ధ్వజమెత్తారు. గతంలో వై.ఎస్.జగన్‌మోహనన్‌రెడ్డి 2 లక్షల మందికి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలిస్తే, చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు.
జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, నియోజకవర్గ అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ శాంతియుత ర్యాలీలను పోలీసులు అణచివేయడం దుర్మార్గమన్నారు. అనంతరం నేతలు కలెక్టరేట్‌కు చేరుకుని డీఆర్వో సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. నిరసనలో మాజీ ఎంపీ బి.వి సత్యవతి, రాష్ట్ర కార్యదర్శులు గండి రవికుమార్, డి.దిలీప్‌కుమార్, ఏడువాక సత్యారావు, పైలా శ్రీనివాసరావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు మలసాల కుమార్‌రాజా, పాలిశెట్టి సురేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, అనకాపల్లి, కశింకోట మండలపార్టీ అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, వివిధ నియోజకవర్గ యువజన విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరు ఆగదు : వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
ఈ డీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. అప్పటివరకు ఈ ప్రక్రియను నిలిపివేసి, అర్హులైన నిరుద్యోగులందరికీ న్యాయం జరిగేలా కొత్తగా పారదర్శకంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుంది. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ ఉద్యమం ఆగేది లేదు.
‘ఎన్నికల ముందు కోట్లాది మంది యువతకు ఉద్యోగాలిస్తామని నమ్మించి, అధికారంలోకి వచ్చాక తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీలోనే భారీ అక్రమాలకు తెరలేపారు. వేల పోస్టుల భర్తీ అంటూ ప్రగల్భాలు పలికి, తీరా చూస్తే నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్యను కుదించి, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ నోటిఫికేషనన్ ప్రక్రియ, పోస్టుల కేటాయింపులో తీవ్రమైన అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి‘ అని ఆరోపించారు.మాడుగుల నియోజకవర్గానికి చెందిన అదిరెడ్డి వెంకటరావురెడ్డి డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్‌లెటర్ పొందినా, తీరా వెళ్లాక అధికారులు ఉద్యోగం లేదనడం ప్రభుత్వ దగాకు నిదర్శనమన్నారు. అర్హులకు కాకుండా స్పోర్ట్స్ కోటా పేరిట, జీవో నెం. 272 తెచ్చి కూటమి అనుకూలురకు ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారని, మెరిట్ లిస్టును ఎందుకు దాచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


