కొత్త జోన్‌ శకం.. | - | Sakshi
Sakshi News home page

కొత్త జోన్‌ శకం..

Jun 1 2026 12:38 AM | Updated on Jun 1 2026 12:38 AM

డెక్‌లోని తాత్కాలిక కార్యాలయంలో జోన్‌ కార్యకలాపాలకు శ్రీకారం
నిరాడంబరంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి లాంఛనంగా మొదలు

నేడే ప్రారంభం!

హాజరుకానున్న మూడు జోన్ల

మేనేజర్లు, డీఆర్‌ఎంలు

రైళ్ల రాకపోకలతో కార్యకలాపాలు

ప్రారంభించనున్న అధికారులు

క్రమంగా నిర్వహణ, ఆస్తుల విభజన

అంశాలు కొలిక్కి

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలు

జారీ చేసిన రైల్వే బోర్డు అధికారులు

సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాల పోరాటాలు, కోట్లాది మంది ఆశల నడుమ సాధించుకున్న ‘కొత్త రైల్వే జోన్‌’ శకం సోమవారం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. రైల్వే బోర్డు ఉన్నతాధికారుల మార్గనిర్దేశంతో.. నేటి నుంచి వీఎంఆర్‌డీ డెక్‌ భవనంలోని తాత్కాలిక కార్యాలయం వేదికగా జోనల్‌ కార్యకలాపాలకు ఉన్నతాధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సోమవారం ఉదయం 9 గంటలకు నిరాడంబరంగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుండగా.. రైల్వే ముఖచిత్రంలో విశాఖ కేంద్రంగా సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. రైళ్ల రాకపోకలతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. డిపార్ట్‌మెంట్‌ల వారీగా సంబరాలు చేసుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌

కార్యకలాపాలకు శ్రీకారం

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు డెక్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయం నుంచి సోమవారం నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా జరిగే ఈ కార్యక్రమానికి జోన్‌కు చెందిన జనరల్‌ మేనేజర్లు, డీఆర్‌ఎంలు హాజరుకానున్నారు. ఢిల్లీలోని రైల్వే బోర్డు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. రైళ్ల రాకపోకల పర్యవేక్షణతో పాటు పాలనాపరమైన కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. జోన్‌ అధికారులు వాల్తేరు డివిజన్‌ అధికారులతో, వివిధ విభాగాల అధిపతులతో సమీక్షలు నిర్వహించి శాఖల వారీ బాధ్యతలు, ఫైళ్ల బదిలీ ప్రక్రియ, మౌలిక వసతుల కల్పనపై కార్యాచరణ రూపొందించనున్నారు.

అలాగే ఉద్యోగుల బదిలీలు, ఆప్షన్ల ప్రక్రియలో ఉన్న సమస్యలపై రైల్వే కార్మిక సంఘాలతో కూడా చర్చించే అవకాశం ఉంది.

ఈ నెలాఖరుకల్లా

ఉద్యోగుల సర్దుబాటు పూర్తి : కొత్త జోన్‌ ఏర్పాటులో అత్యంత కీలకమైన మానవ వనరుల కేటాయింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ జోన్‌లో పనిచేసేందుకు ఇప్పటికే వివిధ విభాగాల నుంచి సుమారు 3,500 మందికి పైగా సిబ్బంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో ఇప్పటి వరకూ 800 మందికి పైగా ఉద్యోగుల నియామక సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన సిబ్బంది బదిలీలు, సర్దుబాటు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు బోర్డు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది.

డిపార్ట్‌మెంట్ల వారీగా సంబరాలు

కల సాకారం అవుతున్న నేపథ్యంలో రైల్వే ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ క్షణం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జోన్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతుండటంతో, డిపార్ట్‌మెంట్ల వారీగా ప్రత్యేకంగా సెలబ్రేషన్స్‌ నిర్వహించుకునేందుకు సిబ్బంది భారీ ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒక పక్క విధులు నిర్వర్తిస్తూనే, తమ కలల జోన్‌ ఆవిర్భావాన్ని కేక్‌ కటింగ్‌ చేసి.. స్వీట్స్‌ పంచుకుంటూ పండుగలా చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

కొలిక్కి వస్తున్న ఆస్తుల విభజన

వైజాగ్‌ జోన్‌ పరిధిలో నిర్వహణ, భౌగోళిక సరిహద్దులు, ఆస్తుల విభజన ప్రక్రియలు క్రమంగా ఓ కొలిక్కి వస్తున్నాయి. పరిపాలనాపరమైన చిక్కులు తలెత్తకుండా స్పష్టమైన కార్యాచరణతో పాత జోన్ల నుంచి ఫైళ్ల బదిలీ, ఆస్తుల పంపిణీకి సంబంధించిన సాంకేతిక అంశాలను ఉన్నతాధికారులు సామరస్యంగా పరిష్కరిస్తున్నారు. రానున్న రోజుల్లో విశాఖ కేంద్రంగా మౌలిక సదుపాయాల కల్పన, శాశ్వత భవన నిర్మాణం తదితర భారీ ప్రాజెక్టులకు ఈ పరిణామం మార్గం సుగమం చేయనుంది.

రేపటి నుంచి

పూర్తిస్థాయి సమన్వయం

దక్షిణ కోస్తా జోన్‌ పాలనా యంత్రాంగం ఇకపై రోజువారీ విధుల్లో వేగం పెంచనుంది. 2వ తేదీ నుంచి వివిధ విభాగాల అధిపతులు (హెచ్‌వోడీలు) తమ తమ విభాగాల కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఈ క్రమంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటి వరకూ ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్‌ పరిధిలో జరిగిన పాలనా వ్యవహారాలను, వైజాగ్‌ జోన్‌ విధానాలకు అనుగుణంగా మార్చే ప్రక్రియపై రేపు స్థానిక వాల్తేరు డివిజన్‌ అధికారులతో కీలక సమన్వయ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రైళ్ల నిర్వహణ, గూడ్స్‌ రవాణా ఆదాయం మళ్లింపు వంటి సాంకేతిక అంశాలపై ప్రాథమిక చర్చలు జరగనున్నాయి.

ఇంకా సిద్ధం కాని జోన్‌ గైడ్‌ లైన్స్‌

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి జనరల్‌ గైడ్‌ లైన్స్‌ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నూతన మార్గదర్శకాలు ఖరారయ్యే వరకు, ప్రస్తుతం ఆయా డివిజన్లలో అమలవుతున్న పాత గైడ్‌ లైన్స్‌ కొనసాగించాలని ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా, విశాఖపట్నం డివిజన్‌కు సంబంధించి తూర్పు కోస్తా రైల్వే నిబంధనలను యథాతథంగా అమలు చేయనున్నారు. అదేవిధంగా గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్లలో దక్షిణ మధ్య రైల్వే నిబంధనలు కొనసాగుతాయి. సిబ్బంది సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, ఇతర పరిపాలనా సంబంధిత వ్యవహారాలన్నీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత విధానంలోనే జరుగుతాయని అధికారులు వివరించారు. కొత్త జోన్‌ మార్గదర్శకాలు వచ్చే వరకు ఏ నియమాలు పాటించాలనే దానిపై ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత విధానాలనే అనుసరిస్తారని జోన్‌ ఓబీసీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెదిరెడ్ల రాజశేఖర్‌ సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement