కాల్స్‌కు తింటున్నాయి.. | - | Sakshi
Sakshi News home page

కాల్స్‌కు తింటున్నాయి..

Jun 1 2026 12:38 AM | Updated on Jun 1 2026 12:38 AM

అడ్మిషన్ల కోసం ఫోన్‌కాల్స్‌తో దాడి

ఉదయం మొదలు అర్ధరాత్రి వరకూ మోతమోగిస్తున్న కాలేజీల సిబ్బంది

బెంబేలెత్తుతున్న పేరెంట్స్‌..

విచారణకు డిమాండ్‌

పదోతరగతి, ఇంటర్‌ ఫలితాలు ప్రకటించింది మొదలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. ఫోన్లు చేస్తూ మోతమోగిస్తున్నాయి. చిరునామాలు సంపాదించి విద్యార్థుల తల్లిదండ్రుల చుట్టూ.. కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు తిరుగుతూ ఆలోచించుకోనివ్వకుండా వేధిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

కాలేజీలు

అనకాపల్లి టౌన్‌: ‘మీ అబ్బాయి/అమ్మాయి టెన్త్‌, ఇంటర్‌ పాసయ్యారు కదా మా కాలేజీలో చేర్చండి మా దగ్గర సీటు రిజర్వ్‌ చేసుకోండి..ఇప్పుడు సీటు రిజర్వ్‌ చేసుకుంటే ఫీజులో 20 నుంచి 50 శాతం వరకూ రాయితీ ఇస్తాం’ అంటూ విరామం లేకుండా ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు చేస్తున్నారు. ఆఫీస్‌ పనుల్లో బిజీగా ఉన్నా, డ్రైవింగ్‌లో ఉన్నా నిరంతరం కాల్స్‌ వస్తుండడంతో తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన మరుక్షణం నుంచే ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఫోన్ల కాల్స్‌తో దాడికి దిగారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వస్తున్న ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లతో తల్లిదండ్రులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక్కో విద్యార్థి తల్లిదండ్రులకు రోజుకు కనీసం 20 నుంచి 30 కాల్స్‌ వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. తమ పిల్లల జాయినింగ్‌ కోసం తల్లిదండ్రులు ఎక్కడా కనీసం దరఖాస్తు చేయకపోయినా, విచారించకపోయినా నేరుగా వారి నంబర్లకే ఫోన్లు వస్తున్నాయి. కొన్ని చోట్ల విద్యార్థి ఇంటి నంబర్‌తో సహా పూర్తి అడ్రస్‌ కూడా ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండే తల్లిదండ్రులు ఫోన్‌ ఎత్తడానికే భయపడుతున్నారు. ఒక వేళ కట్‌ చేస్తే, పదే పదే రింగ్‌ చేస్తూ విసుగు తెప్పిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా తమ వ్యక్తిగత వివరాలు ప్రైవేట్‌ శక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని పేరెంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయ వనరుగా విద్యార్థుల డేటా

జిల్లాలో కొన్ని విద్యా సంస్థలు విద్యార్థుల డేటాను ఆదాయవనరుగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్చుకునేటప్పుడు ఆయా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, ఫోన్‌ నంబర్లు, ఏ పనిచేస్తున్నారు తదితర వివరాలు తీసుకుంటాయి. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగియడమే తరువాయి విద్యార్థుల సమాచారాన్ని అంగట్లో సరుకుగా మార్చి, కొందరు అడ్మిషన్ల దందాకు సహకరిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల పేర్లు, చిరునామా, ఫోన్‌ నంబర్లు ప్రైవేట్‌ కాలేజీల చేతుల్లోకి వెళుతుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ డేటాబేస్‌ నుంచే లీకేజీ?

విద్యార్థులు కేవలం ప్రభుత్వ అధికారిక సైట్లలో, పాలిటెక్నిక్‌ పరీక్ష అప్లికేషన్లలో లేదా తాము చదివిన స్కూళ్లలో మాత్రమే ఫోన్‌ నంబర్లు నమోదు చేస్తారు. అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ ప్రాంతీయ కార్యాలలయం, లేకపోతే విద్యార్థులు చదివే పాఠశాలలు, కళాశాల నుంచి వెళ్లే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఏటా అడ్మిషన్ల సీజన్‌లో ప్రభుత్వ విద్యాశాఖ ఆఫీసుల్లోని కీలక సమాచారాన్ని భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు

జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా డేటా లీకేజీ అవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రైవేట్‌ సంస్థల సిబ్బంది విద్యార్థుల ఇళ్లకు ఎలా చేరుకోగలుగుతున్నాయో అధికారులకు తెలియదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచే లీక్‌ అవుతుందా లేక సంబంధిత పాఠశాలల నుంచి వెళ్తుందా అనే కోణంలో తక్షణమే ఉన్నతాధికారులు, సైబర్‌ క్రైమ్‌ విభాగం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement