ఇక అంతా గతమే.. ఘన చరిత్రే..
● 133 ఏళ్ల వాల్తేరు డివిజన్ అద్భుత ప్రస్థానానికి అధికారిక ముగింపు
● విశాఖపట్నం, రాయగడలుగా విడిపోయిన ’బంగారు బాతు’
● నేటి అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం డివిజన్ యుగారంభం
● కొత్త విశాఖపట్నం డివిజన్ తొలి డీఆర్‌ఎంగా లలిత్ బోహ్రా
వాల్తేరు డీఆర్‌ఎం కార్యాలయంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌గా పేరు మార్పు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘వాల్తేరు’ పేరు ఇక చరిత్ర పుటల్లోకి చేరబోతోంది. భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మక డివిజన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన వాల్తేరు డివిజన్ ప్రస్థానం నేటి అర్థరాత్రితో ముగియనుంది. జూన్ 1 నుంచి ‘వాల్తేరు’ అనే పేరు అధికారికంగా రైల్వే మ్యాప్ నుంచి కనుమరుగై, దాని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఆవిర్భవించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నం, రాయగడ డివిజన్లుగా విభజించింది. మే 31 అర్ధరాత్రి నుంచి ఈ మార్పు అమల్లోకి రానుండగా, ప్రస్తుత వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బోహ్రా నూతన విశాఖపట్నం డివిజన్‌కు తొలి డివిజనల్ రైల్వే మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
1893 నుంచి మొదలైన మహోజ్వల చరిత్ర
వాల్తేరు డివిజన్ చరిత్ర మూలాలు 19వ శతాబ్దం చివరలో నిక్షిప్తమై ఉన్నాయి. మద్రాసు నుంచి కలకత్తాను కలిపే ‘తూర్పు తీర రైల్వే’ నిర్మాణంలో భాగంగా 1893లో వాల్తేరుకు తొలిసారిగా రైలు మార్గం ఏర్పడింది. అనంతరం 1896లో బెంగాల్–నాగ్‌పూర్ రైల్వే ఆధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత కాలక్రమేణా వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖపట్నం పోర్టు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సరుకు రవాణాకు వాల్తేరు ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెంది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది.
భారతీయ రైల్వేకు ‘బంగారు బాతు’
రైల్వే ఆదాయ వనరుల్లో వాల్తేరు డివిజన్ ఒక బంగారు బాతు లాంటిది. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోనే అత్యధిక ప్యాసింజర్, సరుకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన రికార్డు ఈ డివిజన్ సొంతం. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బొగ్గు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాలో వాల్తేరు ఎన్నో రికార్డులను సృష్టించింది. ఛత్తీస్‌గ్‌లోని బైలడిల్లా గనుల నుంచి విశాఖ పోర్టుకు ఇనుప ఖనిజాన్ని చేరవేసే కొత్తవలస–కిరండూల్ (కేకే లైన్) మార్గం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి సజీవ సాక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, క్లిష్టమైన మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ రూట్‌లో 56 సొరంగాలు, 87 భారీ వంతెనలు, 1236 చిన్న వంతెనలు ఉన్నాయి.
ప్రకృతి అందాలు.. అవార్డుల పంట
కేవలం సరుకు రవాణాకే పరిమితం కాకుండా, పర్యాటక రంగంలోనూ వాల్తేరు తనదైన ముద్ర వేసింది. బొర్రా గుహలు, అరకు లోయ వంటి ప్రకృతి సిద్ధమైన అద్భుత ప్రాంతాల మీదుగా సాగే రైలు ప్రయాణం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందిస్తోంది. విశాలమైన అద్దాల పెట్టెలు కలిగిన ’విస్టాడోమ్’ రైలును ప్రవేశపెట్టి పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఈ డివిజన్ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. పర్యావరణ హితమైన రైల్వే నిర్వహణలో, స్వచ్ఛతలో అనేక జాతీయ పురస్కారాలను సైతం సొంతం చేసుకుంది. అయితే, విభజన కారణంగా ఈ ప్రకృతి రమణీయ మార్గంలో ఎక్కువ భాగం కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్‌లోకి వెళ్లిపోతోంది.
గుండెల్లో పదిలంగా.. ‘వాల్తేరు’ జ్ఞాపకం
వాల్తేర్ డివిజన్ గడిచిన దశాబ్ద కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ దేశంలోనే అత్యధిక ఆదాయం తీసుకొచ్చిన డివిజన్‌గా నిలిచింది. కలల జోన్ ఏర్పాటులో భాగంగా.. ఈ చారిత్రక డివిజన్ రూపాంతరం చెందడం ఒక విధంగా బాధాకరమే. స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు విశాఖలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, లోకల్ రిక్రూట్‌మెంట్ సెల్‌తో పాటు అన్ని రకాల నైపుణ్య శిక్షణా కేంద్రాలను తక్షణమే విశాఖ డివిజన్ పరిధిలోనే ఏర్పాటు చేయాలి. దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్‌గా వాల్తేరు జ్ఞాపకం స్థానికుల గుండెల్లో ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది.
–పెదిరెడ్ల రాజశేఖర్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు


