మంగళం ! | - | Sakshi
Sakshi News home page

మంగళం !

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

జిల్లాలో ఐదింటిలో నాలుగు మూత

చంద్రబాబు ప్రభుత్వంలో అందని ప్రోత్సాహం, సబ్సిడీల నిలిపివేత

పెట్టుబడులు పెట్టి లబోదిబోమంటున్న డ్వాక్రా మహిళలు

మహిళా మార్టులకు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, కార్పొరేట్‌ మాల్స్‌కు దీటుగా ఏర్పాటైన వైఎస్సార్‌ చేయూత మహిళా మార్ట్‌లపై కూటమి ప్రభుత్వం శీతకన్నేసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐదు మార్ట్‌లలో ప్రస్తుతం నాలుగు పూర్తిగా మూతపడ్డాయి. పెట్టుబడి పెట్టిన డ్వాక్రా సభ్యులు లబోదిబోమంటున్నారు.

సాక్షి, అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు మరింత చేయూతనిస్తూ వారు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో వెలుగు శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ మహిళామార్టులను ఏర్పాటు చేసింది. తద్వారా మహిళలు వ్యాపారాభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోన్‌ రెడ్డి లక్ష్యం. పెద్ద పెద్ద మాల్స్‌ని తలదన్నేలా ఏర్పాటు చేసి, తక్కువ ధరకే నిత్యావసర సరుకులు విక్రయించారు. ఈ మార్ట్‌లలో వివిధ రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరకు పొదుపు మహిళలు కొనుగోలు చేసుకుంటూ సద్వినియోగం చేసుకోవడంతో ఒకవెలుగు వెలిగాయి. ఈ మార్ట్‌ల్లో సభ్యత్వం పొందిన పొదుపు గ్రూపు సభ్యులకు డోర్‌ డెలివరీ సదుపాయం కూడా కల్పించారు. జిల్లాలో మాకవరపాలెం, మాడుగుల, చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, అడ్డురోడ్డులో కార్పొరేట్‌ తరహాలో ఒక్కో మార్టును సుమారు రూ.40లక్షలతో ఏర్పాటు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక

అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మహిళా మార్టులపై శీతకన్నేసింది. నిత్యావసర సరుకులపై ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు.దీనికి తోడుగా ఓపెన్‌ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరగడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో మార్ట్‌లు నష్టాల బాట పట్టాయి. ప్రభుత్వ నిధులు సకాలంలో విడుదల కాకపోవడం, అమ్మకాలు పడిపోవడంతో భవనాల అద్దెలు, కరెంట్‌ బిల్లుల నిర్వహణ భారంగా మారింది. మార్ట్‌లలో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందకపోవడంతో వారు విధులకు దూరమయ్యారు. దీంతో మాకవరపాలెం మినహా మిగిలిన నాలుగు మార్టులు మూతపడ్డాయి.

పెట్టుబడి సొమ్ము మాటేమిటి !

పెట్టుబడి నిమిత్తం డ్వాక్రా సభ్యుల నుంచి ఒక్కో మార్టుకు సుమారు రూ. 40 లక్షల చొప్పున వసూలు చేశారు. మార్ట్‌లు మూతపడటంతో ఆ పెట్టుబడి డబ్బులు తిరిగి ఎప్పుడు వస్తాయో తెలియక మహిళలు ఆందోళన చెందుతున్నారు. నాడు నెలకు కనీసం రూ. 250 సరుకులు కొనేలా ఉన్న నిబంధనలను, ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది.

నేడు : సబ్బవరంలో మూతపడిన మహిళా మార్టు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement