అచ్యుతాపురం రూరల్: దేశంలో వ్యవసాయ రంగం మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో ఉన్న వస్త్ర పరిశ్రమలో ఎక్కువ మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. మండలంలోని సెజ్‌లో గల బ్రాండిక్స్ పరిశ్రమను శనివారం ఆయన సందర్శించారు. పరిశ్రమలో కార్మికుల పనితీరు, యాజమాన్యం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బ్రాండిక్స్ తరహాలో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం సాధారణ దుస్తులతో పాటు ఏరోస్పేస్, డ్రోన్లు, రక్షణ, వైద్య, వ్యవసాయ రంగాల్లో టెక్నికల్ టెక్స్‌టైల్ వినియోగం విపరీతంగా పెరుగుతోందన్నారు. ఇటువంటి విభాగాల్లో రాష్ట్రానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ్ కృష్ణన్, జౌళిశాఖ రాష్ట్ర కమిషనర్ రేఖా రాణి, బ్రాండిక్స్ ఇండియా పార్ట్‌నర్ దొరస్వామి, పరిశ్రమ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


