కె.కోటపాడు: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నాయకులు విస్మరించారని చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు కాసుబాబు అన్నారు. కె.కోటపాడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన 24 వేల మంది సభ్య రైతులు, సుమారు రెండు వేల మంది కార్మికులు గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. గోవాడ సుగర్స్ రైతులకు సుమారు రూ.30 కోట్ల బకాయిల చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల ఆవేదనను రెండు నియోజకవర్గాల శాసన సభ్యులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మహాజన సభను కూడా నిర్వహించకపోవడంతో శోచనీయమన్నారు. ఫ్యాక్టరీ తెరిపించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చెరకు సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్యాక్టరీ ద్వారా రైతులకు విత్తనాలను అందించాలని కాసుబాబు కోరారు.


