ధాన్యం.. దైన్యం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం.. దైన్యం

May 30 2026 12:23 AM | Updated on May 30 2026 12:23 AM

ఆరుగాలం శ్రమించి పండించిన పంట చి‘వరి’ దశకు చేరినా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగక అన్నదాత కష్టాల పాలవుతున్నాడు. పంటను అమ్ముకునేందుకు అవస్థలకు గురవుతున్నాడు. కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. మరో వైపు వాతావరణంలో మార్పులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో మద్దతు ధర ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాడుగుల: ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా రబీలో ఏడువేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సరాసరిన ఎకరాకు రెండు టన్నుల వరకూ దిగుబడి లభించింది. ఈ లెక్కన 14 వేల టన్నుల వరకు పండింది. జిల్లాలో మొట్టమొదటి సారిగా రబీలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేవలం మూడు మండలాల్లో ఆరు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. జిల్లాలో సుమారు 14వేల టన్నుల ధాన్యం దిగుబడి రాగా, కేవలం 500 టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదు. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు 350 టన్నులు మాత్రమే కొనుగోలులో చేశారు. సకాలంలో కొనుగోలు చేయకపోడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

కొనుగోలులో షరతులు

జిల్లాలో రాంబిల్లి, మాడుగుల, బుచ్చెయ్యపేట మండలాల్లో రబీ ధాన్యం కొనుగోలుకు ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలులో కేంద్రాల నిర్వాహకులు పెడుతున్న షరతులతో అన్నదాతలు అవస్థలకు గురవుతున్నారు. సకాలంలో ట్రక్‌ షీట్‌లు ఇవ్వకపోవడంతో పొలాల్లో ఉన్న, ట్రాక్టర్లలో లోడుచేసిన ధాన్యం ఎండకు ఎండి, వర్షాలకు తడిసి పోవడంతో రంగుమారుతోంది. శాంపిల్‌ ధాన్యం పాయింట్స్‌ 22 బదులు 27 పెట్టి, నూక శాతం ఎక్కువ చూపించి,100 కిలోలకు 10 నుంచి 12 కిలోలు తగ్గిస్తున్నారు. వాటి డబ్బులు చెల్లిస్తేనే ధాన్యం తీసుకుంటామని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలు గ్రామాల రైతులు వాపోతున్నారు. మిల్లుల వద్దకు ధాన్యాన్ని తీసుకెళ్లి మూడు రోజులు గడుస్తున్నా ట్రక్‌ షీట్‌లు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు.ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు.

దళారులదే రాజ్యం

ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం తీసుకోకపోవడంతో భద్రపరచలేక, కూలీలకు డబ్బులు చెల్లించలేక రైతులు దళారులను ఆశ్రయించవలసి వస్తోంది. ప్రభుత్వంటన్నుకు రూ.23,890 ధర చెల్లిస్తుండగా, దళారులు రూ.17 వేల నుంచి రూ. 18 వేలు మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో నూర్చిన ధాన్యాన్ని భద్రపరుచుకోలేక దళారులు అడిగిన ధరకే అమ్ముకోవలసి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బుచ్చెయ్యపేట మండలంలో మిల్లువద్ద మూడు రోజులుగా ట్రాక్టర్‌పై ఉండిపోయిన ధాన్యం

మిల్లు చుట్టూ తిరుగుతున్నా..

మూడు రోజులుగా మిల్లు చుట్టూ తిరుగుతున్నాను. మిల్లుకు తీసుకువెళ్లిన ధాన్యం ట్రాక్టరు మీద మూడు రోజులు నుంచి ఎండిపోతోంది. సకాలంలో తీసుకోకపోవడంతో వర్షాల కారణంగా నూర్పు చేసిన ధాన్యం పొలాల్లో తడిసిపోతోంది. నాకు ట్రక్‌ షీట్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. టన్నుకు 60నుంచి 70 కిలోలు తరుగుతీస్తున్నారు. నూక శాతం అధికంగా చూపించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎంతో కష్టపడి మిల్లువద్దకు ధాన్యం తీసుకు వెళ్తే లిమిట్‌ అయిపోతుందని సాకులు చూపించి ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు స్పందించి మిల్లుకు తీసుకెళ్లిన ధాన్యాన్ని వెంటనే తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.

– నాగేశ్వర రెడ్డి, కౌలు రైతు, సత్యవరం

500 టన్నులు టార్గెట్‌

జిల్లాలో 500 టన్ను ల రబీ ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 350 టన్నులు సేకరించాం. మిగిలిన 150 టన్నులు ధాన్యం త్వరితగతిన తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేలు రకం 100 కిలోలు రూ. 2,389, కామన్‌ రకం రూ.2,369 మద్దతు ధర చెల్లిస్తున్నాం.

–పి.జయంతి, జిల్లా మేనేజర్‌,

పౌరసరఫరాల సంస్థ అనకాపల్లి

విక్రయానికి ఇబ్బందులు పడుతున్న

అన్నదాతలు

జిల్లాలో కేవలం ఆరు

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఈ ఏడాది కొనుగోలు లక్ష్యం

500 మెట్రిక్‌ టన్నులు

ఇష్టానురీతిన తరుగు డబ్బులు వసూలు

దోచుకుంటున్న ప్రైవేటువ్యాపారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement