అచ్యుతాపురం రూరల్: మండలం కేంద్రం అచ్యుతాపురంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో మూడు నెలల క్రితం పూడ్చిన ఓ వ్యక్తి మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడు తల్లి ఫిర్యాదుతో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసి, నమూనాలు సేకరించడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే అచ్యుతాపురంలోని ఇందిరమ్మకాలనీ సమీపంలో షేక్ ఖాన్ (30) తనకుటుంబంతో నివాసం ఉంటూ మటన్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఫిబ్రవరి 27వ తేదీ శనివారం తన నివాసంలో మృతి చెందాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఖాన్ భార్య, పిల్లలు, ఆయన తల్లి ఉన్నారు. తెల్లవారుజామున షేక్ ఖాన్ నిద్ర లేవకపోవడంతో పరిశీలించిన కుటుంబ సభ్యులు గుండెపోటుతో మరణించాడని భావించి, ముస్లిం సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే, ఖాన్ మరణంపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మూడు నెలల తర్వాత తల్లి ఫిర్యాదు
తన కుమారుడు మరణించిన నాటి నుంచి తల్లి సైదా బీబీకి అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండే తన కొడుకుది సహజ మరణం కాదని, అది ముమ్మాటికీ హత్యేనని ఆమె బలంగా నమ్మింది. అప్పుడు ఆమె చెప్పినా ఆమె మాటలను ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు. ఆమెలో అనుమానాలు నివృత్తికాకపోవడంతో అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లో గత వారం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి గల అసలు కారణాలను శాసీ్త్రయంగా నిర్ధారించేందుకు పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఖననం చేసిన మృతదేహాన్ని శుక్రవారం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక పోస్టుమార్టం వైద్య బృందం, రెవెన్యూ అధికారుల సమక్షంలో బయటకు తీసి, క్షుణ్ణంగా పరిశీలించి, పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మరణానికి గల కారణాలను విశ్లేషించేందుకు అవసరమైన కీలక నమూనాలను (శాంపిల్స్) వైద్య బృందం సేకరించింది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత మృతదేహాన్ని యథావిధిగా మళ్లీ అదే స్థలంలో పూడ్చిపెట్టారు. వైద్య బృందం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ మూడు నెలల కాలంలో మృతుడి కుటుంబంలో లేదా వెలుపల జరిగిన పరిణామాలు, అలాగే షేక్ ఖాన్‌కు ఎవరితోనైనా గొడవలున్నాయా ? శత్రువులు ఉన్నారా ? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
హత్యగా
అనుమానిస్తున్న తల్లి
నమూనాలు
సేకరించిన పోలీసులు


