అనకాపల్లి: జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారిపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు త్వరితగతిన జైలు శిక్షలు పడేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆపరేషన్ ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్త, మహిళా, శిశు భద్రత విభాగం ఐజీ రాజకుమారి పర్యవేక్షణలో ఏపీ పోలీస్ శాఖ స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడానికి ప్రతిష్టాత్మక ‘ఆపరేషన్ దండాయన’ ను ప్రారంభించినట్టు తెలిపారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం అవలంభించనున్నట్టు పేర్కొన్నారు. 60 రోజుల్లో చార్జిషీట్ వేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు శిక్షలు పడేవిధంగా చర్యలు చేపడతామని తెలిపారు. పునరావృత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు బాధిత మహిళలకు కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రజల భాగస్వామ్యంతో సైబర్ వాచ్ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు సామాజిక కార్యకర్తలతో కలిసి పరివర్తన సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఇటీవల కోర్టులు ఇచ్చిన తీర్పులను పాఠశాలలు, కళాశాలల్లో ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 28 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.


