తీరని దారిద్య్రం | - | Sakshi
Sakshi News home page

తీరని దారిద్య్రం

Jun 16 2026 12:16 AM | Updated on Jun 16 2026 12:16 AM

సీఎం, డిప్యూటీ సీఎం పర్యటించినా

పర్యటనకు ముందు హడావుడిగా పనులు

ముగిసిన తరువాత పట్టించుకోని అధికారులు

ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్రవాహనాలు

నరకయాతన పడుతున్న ప్రయాణికులు

పర్యాటకులకు తప్పని అవస్థలు

సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు... ఇక ‘దారి’ద్య్రం తీరినట్టేనని ఆయా గ్రామస్తులు ఎంతో సంతోషించారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు కూడా రోడ్లను అందంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పర్యటన సమయంలో కొంత భాగం నిర్మించారు. మిగతా భాగాన్ని వదిలేయడంతో ఆ రోడ్లు ప్రస్తుతం అధ్వానపు బాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనలు చేసినప్పటికీ రోడ్ల దుస్థితి మారకపోవడంపై స్థానిక ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి,పాడేరు: సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటించడంతో అధికారులు హడావుడిగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. వారి పర్యటన ఎక్కడవరకూ ఉందో ఆ మేర మాత్రమే నిర్మించి, మిగతా భాగాన్ని నిధులు లేవనే సాకుతో గాలికి వదిలేశారు.ప్రస్తుతం ఈ అధ్వాన రోడ్లలో ప్రయాణానికి ప్రజలు నరకయాతన పడుతున్నారు.

కొత్త పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డు

సీఎం చంద్రబాబు గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు మండలం వంజంగి ప్రాంతంలో పర్యటించారు. సీఎం రాకతో పాడేరు కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి కొత్తపాడేరు మీదుగా లగిశపల్లి హెలిపాడ్‌,వంజంగి రోడ్ల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్తపాడేరు జంక్షన్‌ నుంచి లగిశపల్లి వరకు మాత్రమే రోడ్డును అభివృద్ధి చేశారు.గొందూరు కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి కొత్తపాడేరు జంక్షన్‌ వరకు కిలోమీటరు రోడ్డుకు ఇరువైపులా వెడల్పు చేసే పనులు చేపట్టి, కంకరతో కూడిన క్రషర్‌ బుగ్గి వేసి మమ అనిపించారు. సీఎం పర్యటన ముగిసి 10 నెలలు కావస్తున్నా ఇంతవరకు రోడ్డును అభివృద్ధి చేయకపోవడంతో అధ్వానంగా మారింది.రోడ్డు అంచులు కోతకు గురవడంతో పాటు రోడ్డుపై రాళ్లు తేలడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం చంద్రబాబు పర్యటించడంతో రోడ్డు అభివృద్ధి చెందుతుందని ఆశపడిన పాడేరు,లగిశపల్లి,వంజంగి పంచాయతీ ప్రజలకు నిరాశే మిగిలింది. రోడ్డును అభివృద్ధి చేయకపోవడంతో వంజంగి కొండను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఓనూరు రోడ్డుదీ అదే గతి

పాడేరు ఘాట్‌లోని మోదకొండమ్మతల్లి పాదాలు గుడి సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డులోని కాఫీతోటల జంక్షన్‌ నుంచి మారుమూల ఓనూరుకు వెళ్లే పంచాయతీ రోడ్డు కూడా అధ్వానంగా ఉంది.ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈఏడాది మార్చి 14న నందిగరువు రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చారు.అయితే ఆరోడ్డు ప్రారంభించాలంటే సుమారు 2కిలోమీటర్ల ఓనూరు జంక్షన్‌ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది.ఉప ముఖ్యమంత్రి పర్యటనతో కాఫీతోటల నుంచి ఓనూరు జంక్షన్‌ రోడ్డును అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ఐటీడీఏ యంత్రాంగం ఇంజినీరింగ్‌ఽశాఖలతో పని ప్రారంభించింది. క్రషర్‌ బుగ్గితో తాత్కాలికంగా అభివృద్ధి చేసింది. ఈరోడ్డును కూడా తారురోడ్డుగా అభివృద్ధి చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు.క్రషర్‌ బుగ్గితో చదును చేసి, డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన ముగించిన అధికారులు ఓనూరు రోడ్డు అభివృద్ధిని గాలికి వదిలేశారు.క్రషర్‌ బుగ్గిపై ప్రయాణిస్తున్న వాహనాలు జారిపోయి అదుపు తప్పుడుతండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరు మండలంలోని మోదాపల్లి,వంట్లమామిడి పంచాయతీల ద్విచక్రవాహన చోదకులు నరకయాతన పడుతున్నారు. భారీ వర్షం కురిస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గిరిజనులు వాపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement