ఇళ్ల బిల్లుల కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల బిల్లుల కోసం ఆందోళన

Jun 16 2026 12:16 AM | Updated on Jun 16 2026 12:16 AM

భారీ ర్యాలీ, ఎంపీడీవోకార్యాలయం ముట్టడి

ముంచంగిపుట్టు: పీఎం జనమన్‌,జనరల్‌ గృహాల బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రం ముంచంగిపుట్టులో గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్థానిక కల్యాణ మండపం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ముట్టడించారు. అనంతరం పెద్ద ఎత్తున ధర్నా చేశారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు ఎం.ఎం.శ్రీను, కె.నర్సయ్య మాట్లాడుతూ బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నారని, మొండిగోడలతో అసంపూర్తిగా నిర్మాణాలు నిలిచిపోడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. పీఎం జన్‌మన్‌ గృహాలు మంజూరు చేసి రెండు సంవత్సరాలు అవుతున్నా అసంపూర్తిగా దర్శనం ఇస్తున్నాయని,ఒక పక్క రోజురోజుకు గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. బిల్లుల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గృహ లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గృహానికి రూ. లక్ష చొప్పన పెంచిన నగదును వెంటనే అందజేయాలని డిమాండ్‌ చేశారు. జనరల్‌ కేటగిరీలో ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించి, సర్వే చేసి ఏడాది అవుతున్నా నేటికీ ఒక గృహం కూడా మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. తక్షణమే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు బకాయి బిల్లులు చెల్లించాలని, జనరల్‌ గృహాలు మంజూరు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం గృహ నిర్మాణ బిల్లులు, సమస్యలపై ఎంపీడీవో ధర్మారావు,హౌసింగ్‌ ఏఈ కృష్ణరావులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ నాయకుడు త్రినాఽథ్‌, మండల నాయకులు నారాయణ, జీనబంధు, సీతారామ్‌, నర్సంగ్‌రావుపడాల్‌, గణపతి, హౌసింగ్‌ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement