చింతపల్లి: గిరిజన ప్రాంతంలో పశువులు మృత్యువాత పడకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్టు లోతుగెడ్డ పశు వైద్యాధికారి సౌజన్యదేవి తెలిపారు.సోమవారం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోగల కిన్నెర్ల గ్రామంలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా 52 పశువులకు బ్లాక్ క్వార్టర్ వాక్సిన్ వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్లాక్ క్వార్టర్ ప్రాణాంతకమైన బాక్టీరియా సంక్రమణ వ్యాధి అని చెప్పారు. వ్యాధి అతివేగంగా వ్యాప్తి చెంది పశువుల మరణానికి దారితీస్తుందన్నారు. వ్యాధి సోకిన పశువులకు జ్వరం,కుంటితనం లక్షణాలు కన్పిస్తాయని చెప్పారు. లక్షణాలను గుర్తించిన రైతులు వెంటనే చికిత్స చేయించాలని సూచించారు.లేకుంటే ఒకటి రెండు రోజుల్లో మృత్యువాత పడే అవకాశం ఉంటుందని చెప్పారు.ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మనోజ్,శివ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


