వరించిన సిరి | - | Sakshi
Sakshi News home page

వరించిన సిరి

Jun 15 2026 12:05 AM | Updated on Jun 15 2026 12:05 AM

జోరుగా వరి కోతలు పంట నూర్పిళ్లు జిల్లాలో 849 హెక్టార్లలో సాగు

కళకళలాడుతున్న వరిపంట

సాక్షి, పాడేరు: రబీలో వరి వ్యవసాయం గిరిజన రైతులకు కలిసొచ్చింది. రెండవ పంటగా గిరిజనులు ఈఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా 849 హెక్టార్ల లోతట్టు భూముల్లో వరిపంటను గిరిజన రైతులు సాగు చేసారు.సాగు చేసిన వ్యవసాయ భూముల్లో పంట ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట కోతలు, ధాన్యం నూర్పుల పనులు జోరందుకున్నాయి. వ్యవసాయ భూములకు సాగునీరు సమృద్ధిగా ఉండడంతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. పంట ఎదుగుదల సమయంలో ఏప్రిల్‌, మే నెలల్లో విస్తారంగా కురిసిన వర్షాలు కూడా రబీలోని వరిపంటకు ఎంతో మేలు చేశాయి.

వరి పంట కళకళ

జిల్లా వ్యాప్తంగా 849 హెక్లార్ల వ్యవసాయ భూముల్లో ఈ ఏడాది రబీలో వరినాట్లను రైతులు చేపట్టారు.పంట సాగు చేసిన చోట అధిక కంకులతో వరిపంట బాగా పండడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన రైతులు తిండి గింజల అవసరాలకు రెండవ పంటగా వరి సాగును చేపడుతున్నారు,. గిరిజన రైతులు రబీలో వరిపంటను సాగు చేయడం పూర్వం నుంచి అనవాయితీగా మారింది. రబీ వ్యవసాయంలో మాత్రం గిరిజన రైతులంతా తమ వద్ద ఉన్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలనే రబీ సాగుకు వినియోగిస్తారు. తక్కువ సమయంలో అంటే 125 నుంచి 130రోజుల వ్యవధిలో పంట దిగుబడికి రావడంతో ఉత్సాహంగా కోతలు, వెనువెంటనే ధాన్యం నూర్పులు చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజన రైతులు ధాన్యం నూర్పుల యంత్రాలను ఉపయోగిస్తుండగా, మరికొంత మంది పాతపద్ధతిలో నూర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం పంట నూర్పులు అయిన చోట ఎకరానికి 30 బస్తాలు వరకు ధాన్యం దిగుబడి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో రబీ వ్యవసాయం ధాన్యం సిరులు కురిపిస్తుంది.

సంప్రదాయ విత్తనాలతోనే సాగు

రబీలో తమ వద్ద ఉన్న సంప్రదాయ విత్తనాలతోనే వరిపంటను సాగుచేశాం. వరినాట్లు వేసిన తరువాత వర్షాలు ఎక్కువుగా కురవడంతో పంటకు మేలు జరిగింది. మా పొలంతో పాటు తోటి రైతుల పంట భూముల్లోను వరిపంట బంగారంలా పండింది. పంట కోతలతో పాటు నూర్పులు పనులు చేపడుతున్నాం.

–పాంగి సత్యవతి, మహిళా రైతు, బంగారుమెట్ట, పాడేరు మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement