డుంబ్రిగుడ: మండలంలోని తూటంగి పంచాయతీ తూటంగి గ్రామంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనందరావు పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 200 కుటుంబాలు ఉన్న పెద్ద గ్రామమైన తూటంగిలో గడిచిన రెండేళ్లుగా తాగునీరు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. తాగునీటి సమస్య ఉండడంతో గత్యంతరం లేక స్థానికులు ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు వినియోగంతో రోగాలు ప్రబలే అవకాశాలున్నాయని ఆందోళన చెందారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. నాయకులు రమేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


