ప్రవేశాల్లో తీవ్ర జాప్యం | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాల్లో తీవ్ర జాప్యం

Jun 15 2026 12:05 AM | Updated on Jun 15 2026 12:05 AM

పాలిటెక్నిక్‌ ప్రవేశాల కోసం విద్యార్థుల

ఎదురు చూపులు

40 రోజులు అయినా ప్రవేశాల

ప్రకటనకు నోచుకోని వైనం

కొత్త కాలేజీల ఏర్పాటులో

ప్రైవేటు యాజమాన్యాల ప్రయోజనం

కోసమే ఈ జాప్యమన్న విమర్శలు

అటు ఇంటర్‌, ఇటు పాలిటెక్నిక్‌

ఏది జాయిన్‌ అవ్వాలో తేల్చుకోలేని

మధ్యతరగతి, పేద విద్యార్థులు

పట్టించుకోని ఉన్నత విద్యాశాఖ

ఫలితాలు వెలువడినా..

మురళీనగర్‌(విశాఖ): పదో తరగతి అనంతరం సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సులు ఉత్తమ అవకాశంగా భావిస్తారు. పరిశ్రమలు, కంపెనీలు కూడా డిప్లమా విద్యార్థులకు ఉద్యోగాల కల్పనలో అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాలిటెక్నిక్‌లలో చేరేందుకు ఆసక్తి చూపడం సహజం. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో ప్రవేశాల ప్రక్రియ సకాలంలో ప్రారంభం కాకపోవడం వల్ల ప్రతి ఏడాది వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ సమస్య ఏటా పునరావృతమవుతున్నప్పటికీ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాలిసెట్‌ పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించి 40 రోజులు గడిచినా, ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ ఇంకా విడుదల చేయలేదు. దీంతో పాలిసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు.

జాప్యానికి కారణాలేంటి?

ఈసారి ప్రవేశాల జాప్యంపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు అనుమతులు లభించినప్పటికీ, కొన్ని ప్రైవేటు కళాశాలలకు ఇంకా ఆమోదం రాలేదని తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ యాజమాన్యాలు తమ క్యాంపస్‌లలో కొత్త పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో కొన్ని కోరుకున్న బ్రాంచ్‌లకు అనుమతులు రాకపోవడంతో ప్రవేశాల ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందనే చర్చ విద్యావర్గాల్లో సాగుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల భర్తీ కొంతమేర సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రైవేటు కళాశాలల్లో అనేక బ్రాంచ్‌ల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయడానికి యాజమాన్యాలు ప్రత్యక్ష ప్రవేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.

వేల సంఖ్యలో సీట్లు.. అయినా పూర్తి భర్తీ లేదు

నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌లలో అన్ని కోర్సులు కలిపి మొత్తం 62,456 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో 87 ప్రభుత్వ, 178 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉండగా, వీటిలో కలిపి సుమారు 84 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక పాలిసెట్‌లో ఈ ఏడాది 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అయినప్పటికీ ప్రతి ఏడాది వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకపోవడం గమనార్హం. పాలిటెక్నిక్‌ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించి ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో మెరుగైన ఫలితాలు

ఈ ఏడాది ఏప్రిల్‌ 25న నిర్వహించిన పాలిసెట్‌కు జిల్లాలో 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 14,759 మంది విద్యార్థులను కేటాయించారు. వీరిలో 14,118 మంది హాజరై 95.66 శాతం హాజరు నమోదు చేశారు. నగర పరిధిలోని 18 కేంద్రాల్లో 6,330 మందికి గాను 6,019 మంది పరీక్షకు హాజరై 95.09 శాతం హాజరు నమోదైంది. పెందుర్తిలో 96.07 శాతం, గాజువాకలో 96.05 శాతం, మధురవాడలో 95.84 శాతం, తగరపువలసలో 95.78 శాతం, భీమిలిలో 97.68 శాతం హాజరు నమోదైంది. మే 5న విడుదలైన ఫలితాల్లో జిల్లా నుంచి 13,042 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 92.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ప్రవేశాల షెడ్యూల్‌పై ఎదురుచూపులు

పాలిసెట్‌ ఫలితాలు వెలువడి నెలకు పైగా గడిచినా ప్రవేశాలకు సంబంధించిన ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గతంలో ప్రవేశాలు ఆలస్యమవడం వల్ల సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కాకపోయాయనే ఉద్దేశంతో ఈసారి పరీక్షను ముందుగానే నిర్వహించి ఫలితాలను కూడా త్వరగా విడుదల చేశారు. ఈ సమయానికి మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తై కావాల్సి ఉండగా..ఇప్పటికీ షెడ్యూల్‌పై స్పష్టత లేకపోవడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అనేక సీట్లు ఖాళీగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఇతర కోర్సుల్లో చేరిపోతున్నారు. ఫలితంగా పాలిటెక్నిక్‌లకు వెళ్లాల్సిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఇతర విద్యా మార్గాలను ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement