● అడ్డురోడ్డు–కోటవురట్ల
రోడ్డు పనుల దుస్థితి
● నాణ్యతకు తిలోదకాలు
● పట్టించుకోని అధికారులు
కోటవురట్ల : వడ్డించేవాడు మనవాడైతే..వెనక బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంట.. ఇది బాగా వాడుకలో ఉన్న సామెత.. అయితే ఈ సామెతను అన్వయించుకుంటూ ఓ కాంట్రాక్టరు బిల్లులు చేసేవాడు మనవాడైతే..నాణ్యతను తుంగలో తొక్కినా ఫర్వలేదనుకుంటూ రహదారి నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఏడాదిగా సా...గుతున్న నిర్మాణ పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతుండగా ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనులతో చూసినవారి గుండె వేదనతో రగిలిపోతోంది. సాక్షాత్తూ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని అడ్డురోడ్డు–కోటవురట్ల ప్రధాన రహదారి అభివృద్ధి పనుల తీరిది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారులు అద్దంలా మెరిసిపోతాయ్..అంటూ బూటకపు హామీలను కూటమి నాయకులు తెగ గుప్పించేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఎక్కడి గోతులు అక్కడే దర్శనమిస్తుండగా కొన్ని చోట్ల అంతకు మించి అన్నట్టుగా రహదారులు విశ్వరూపం చూపిస్తున్నాయి. ప్రస్తుతం అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల మండలంలోని రామచంద్రపురం జంక్షన్ వరకు రహదారి పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రహదారిలో ప్రయాణిస్తే నరకం అంటే ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే హోం మంత్రి అనిత రహదారి అభివృద్ధి కోసం నానా హడావుడి చేసేశారు. శంకుస్థాపనలు చేసేశారు. కానీ నేటికీ ఈ రోడ్డు అభివృద్ధి పనులు ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు అలాగే ఎదురు చూస్తున్నాయి.
మాటలు కోటలు దాటి...
ప్రతిపక్షంలో ఉండగా ఈ రోడ్డు బాలేదంటూ అప్పటి టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఇప్పటి హోం మంత్రి అనిత ఏకంగా పాదయాత్ర చేసి విమర్శలు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తా, ప్రశ్నిస్తా అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి అయిన తర్వాత రహదారి అభివృద్ధికి రూ.24 కోట్లు కేటాయిస్తున్నామంటూ హడావుడి చేశారు. కానీ నేటికి రెండేళ్లు అయినా రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. 15 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రధాన రహదారిలో వాహనదారులు ఇప్పటికీ నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సదరు కాంట్రాక్టర్ తనకు తోచినప్పుడల్లా కొంత మేర పనులు చేయడం, మళ్లీ నెలల తరబడి ఆగిపోవడం జరుగుతోంది.
నాసిరకంగా నిర్మాణ పనులు
ప్రస్తుతం ఇందేశమ్మవాక ఘాట్‌రోడ్డు వద్ద పనులు ప్రారంభించగా ఈ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. వాస్తవానికి తవ్వేసిన రోడ్డు పెచ్చులను తొలగించి మెటల్‌తో రోలింగ్ చేసి ఆ తర్వాత తారు రోడ్డు వేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పనులు పూర్తి విరుద్ధంగా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వేసిన పెచ్చులను అక్కడే వదిలేసి దానిపైనే రోలింగ్ చేసి తారురోడ్డు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ ఏదీ...
దీనిపై వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పైల రమేష్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశారని ఆరోపించారు. పర్యవేక్షించాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని విమర్శించారు. పెచ్చులు తవ్వి దానిమీదే రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాగే రోడ్డు వేస్తే ఏడాది తిరక్కుండానే వేసిన రోడ్డు కొట్టుకుపోతుందని చెబుతున్నారు. ఘాట్‌రోడ్డు కావడంతో ఏమాత్రం నాణ్యత లేకపోయినా చాలా తొందరగా రోడ్డు పాడవుతుందన్నారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఈ పనులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.


