సమస్యల వల.. మత్స్య వేట విలవిల | - | Sakshi
Sakshi News home page

సమస్యల వల.. మత్స్య వేట విలవిల

Jun 15 2026 12:05 AM | Updated on Jun 15 2026 12:05 AM

ఆశ నిరాశల మధ్య మత్స్య వేట ప్రారంభం

అర్హులకు అందని మత్స్యకార భరోసా

మహారాణిపేట: సముద్రంలో మత్స్య సంపద వేట ఆశ, నిరాశల మధ్య పునఃప్రారంభమవుతోంది. 61 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మొదలవుతున్న ఈ వేటపై మత్స్యకారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఒకవైపు సబ్సిడీ డీజిల్‌ అందకపోవడం, మరోవైపు అర్హులకు ‘మత్స్యకార భరోసా’ రాకపోవడం, వీటికి తోడు ‘ఎదురు అమావాస్య’ రావడంతో వేటను ఎలా ప్రారంభించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే వేట కోసం సుమారు 400 బోట్లు సిద్ధమయ్యాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 15వ తేదీ వరకు సముద్ర తీరంలో మత్స్య సంపద సంరక్షణ, పునరుత్పత్తి కోసం రెండు నెలల పాటు వేట నిషేధం అమలులో ఉంటుందనే సంగతి తెలిసిందే. పది నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేసిన మత్స్యకారులకు ఈ రెండు నెలలు విశ్రాంతి లభించింది. నిషేధ కాలం ముగియడంతో జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచే వేటకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, ఎదురు అమావాస్య ప్రభావం వల్ల దాదాపు 70 శాతం మంది మత్స్యకారులు జూన్‌ 17 నుంచి వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందువల్లే గతంలో ఉన్నంత సందడి ప్రస్తుతానికి ఫిషింగ్‌ హార్బర్‌లో కనిపించడం లేదు.

రాని రాయితీ డీజిల్‌ ఆయిల్‌

వేట ప్రారంభ సమయం ఆసన్నమైనప్పటికీ, ప్రభుత్వ రాయితీ డీజిల్‌ ఆయిల్‌ ఇంకా హార్బర్‌కు చేరుకోలేదు. మార్కెట్‌లో పెరుగుతున్న డీజిల్‌ ధరలను భరిస్తూ, సొంత డబ్బులతో ఆయిల్‌ కొనుగోలు చేసి వేటకు వెళ్లడం తమకు కష్టంగా మారిందని మత్స్యకారులు చెబుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అయితే మత్స్యకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి, దాని ద్వారా ప్రతి నెల ఒక్కో బోటుకు మూడు వేల లీటర్ల చొప్పున రాయితీ డీజిల్‌ అందించేవారని, కానీ ఇప్పుడు ఆ కార్డులు పనిచేయడం లేదని, ఆయిల్‌ కూడా రావడం లేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు.

అర్హులకు అందని మత్స్యకార భరోసా

జిల్లాలో వేట నిషేధ కాల భృతి (మత్స్యకార భరోసా) ఇంకా చాలామందికి అందలేదు. ఇస్తామంటూ రోజులు గడుస్తున్నా సాయం అందలేదని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో వేట నిషేధ కాల భృతి కోసం మత్స్యశాఖ 13,597 మంది లబ్ధిదారులను గుర్తించగా, వారిలో 11,224 మందికి మాత్రమే భృతి మంజూరైంది. మిగిలిన 2,373 మందిని వివిధ కారణాలతో ’హోల్డ్‌’లో పెట్టారు. వీరికి ఇప్పటివరకు ఎలాంటి భరోసా రాలేదని అధికారులు చెబుతున్నారు.

భద్రతా ప్రమాణాలు పాటించాలి

ఆదివారం అర్ధరాత్రి నుంచి వేట ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరపడవల్లో తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లు, లైఫ్‌ బోయ్‌లను అందుబాటులో ఉంచుకోవాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు తెలిపారు. బోట్లలోని ట్రాన్స్‌పాండర్లు, జీపీఎస్‌లను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచాలన్నారు. మత్స్యకారులు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వేట సాగించాలని ఆయన సూచించారు.

ఐస్‌ కొరత

ప్రస్తుతం ఫిషింగ్‌ హార్బర్‌లో ఐస్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వేటకు సిద్ధమవుతున్న బోట్లకు గత రెండు రోజుల నుంచి తగినంత ఐస్‌ అందుబాటులో లేదు. దీంతో మత్స్యకారులు నగరంలోని పలు ఇతర ప్రాంతాల నుంచి ఐస్‌ను తెచ్చుకున్నారు. ఒక్కొక్క బోటుకు సముద్రంలో వేట కోసం వెళ్లేటప్పుడు భారీ మొత్తంలో ఐస్‌ అవసరమవుతుంది. ఇది సకాలంలో లభించకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement