చిట్టీల నిర్వాహకుడిపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

చిట్టీల నిర్వాహకుడిపై ఫిర్యాదు

Jun 15 2026 12:05 AM | Updated on Jun 15 2026 12:05 AM

మాకవరపాలెం: చిట్టీల నగదు చెల్లించకుండా ఓ ఉపాధ్యాయుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని రామన్నపాలెంగ్రామానికి చెందిన యాకా అప్పలనాయుడు(చినబాబు) జి.వెంకటాపురం ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఈయన చిట్టీలు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మందితో నగదు కట్టించాడు. అంతేకాకుండా వడ్డీలకు నగదుతీసుకుని వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఏడాది కాలంగా చిట్టీలు పూర్తయినా కట్టించుకున్న నగదు ఇవ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వడ్డీకి తీసుకున్న నగదు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ గ్రామానికి చెందిన యాకా పోతురాజు, రాజుబాబు, లాలం అరుణకుమారితోపాటు కొందరు బాధితులు ఉపాధ్యాయుడు ఇంటి ఎదుట టెంట్‌ వేసి ఆందోళనకు దిగారు. అనంతరం ఈ గ్రామంతోపాటు వివిధ గ్రామాలకు చెందిన బాధితులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. రూ.లక్షల్లో చిట్టీలు కట్టామని, నగదును కూడా ఇచ్చామని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సివచ్చిందన్నారు. తమకు న్యాయం చేయాలని వారంతా కోరారు. బాధితుల ఫిర్యాదుపై విచారణ జరపనున్నట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు.

ఉపాధ్యాయుడి ఇంటి ముందు ఆందోళన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement