రెండేళ్ల దగా.. | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల దగా..

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

అరకు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఎంపీ తనూజ రాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

అరకులోయ టౌన్‌(పాడేరు రూరల్‌): సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో అంతా మోసమేనని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే రేగం ఆధ్వర్యంలో అరకులోయ నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌ జంక్షన్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగింది. అనంతరం మానవహారంగా ఏర్పడి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. రెండేళ్లలో ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్ల కోసం గ్రామ సచివాలయాల చుట్టూ పత్రాలు పట్టుకుని తిరుగుతున్నారన్నారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు అడవితల్లి బాట పేరుతో రోడ్లు వేస్తామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఒక్క రోడ్డయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు.

జగన్‌ హయాంలో ప్రజల చెంతకు పథకాలు

మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ మాజీ సీఎంవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు ఏ ఒక్కటి ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. అంక్షల పేరుతో పింఛన్లతో పాటు సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్నారని ఆరోపించారు.

సమష్టి కృషితోనే మళ్లీ అధికారం

పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రస్తుతం అరకులోయ పార్లమెంట్‌ పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీకి పూర్తి పట్టుందన్నారు. అందరూ సమష్టిగా పని చేసి, రాబోయే మూడేళ్లలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్‌, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నరావు, జిల్లా ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చినసత్యం, ఉమ్మడి జిల్లా ఎస్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్‌, పెదబయలు జెడ్పీటీసీ సభ్యుడు కూడా బోంజుబాబు, మాజీ ఎంపీపీ ఉమమహేశ్వరరావు, అనంతగిరి ఎంపీపీ తెడబాబరికి మితుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, పార్టీ ఆరు మండలాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ విభాగాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పాడేరు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, వెన్నుపోటుకు నిరసనగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రం పాడేరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన భారీ ర్యాలీ దద్దరిల్లింది. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపుతో నియోజకవర్గంలో ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు శుక్రవారం పాడేరుకు స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ సినిమా హాల్‌ సెంటర్‌, పాత బస్టాండ్‌, మెయిన్‌ బజారు, సాయిబాబు గుడి మీదుగా పట్టణ శివారు వీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర సాగింది. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని, త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని సాగనంపటానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి.

వీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్ల ముందు ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సూపర్‌ సిక్స్‌ పేరుతో ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిలువునా మోసం చేశారన్నారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులతో ఆటలాడి ఉద్యోగాలు అర్హులకు దక్కకుండా అమ్ముకున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేశారన్నారు. అన్నదాతలకు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ సొమ్ముతో సంబంధం లేకుండా ఏటా రూ.20వేలు ఇస్తామని చెప్పి దగా చేశారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజురోజుకు హత్యలు, హత్యచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూటమి పార్టీలను చిత్తుగా ఓడించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ తమ పోరాటాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

అడుగడుగునా అడ్డంకులు

‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీకి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, తాము చెప్పిన మార్గంలోనే ర్యాలీ చేపట్టాలని పోలీసులు ఆంక్షలు విధించారు. మైక్‌ ఏర్పాటుకు సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముందుగా నిర్ణయించుకుని అనుమతి పొందిన మార్గం మీదుగా ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు అడ్డుకొని వేరే మార్గం మీదుగా వెళ్లాలని సూచించారు. కానీ భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావడంతో పోలీసులు ఏం చేయలేక చేతులెత్తేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుడు ఏడువాక సత్యారావు, ఎంపీపీలు కోరాబు అనుషాదేవి, బోయిన కుమారి, బడుగు రమేష్‌, వైఎస్సార్‌సీపీ మండలాల అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మాని మత్య్సకొండం నాయుడు, పాంగి గుణబాబు, కంకిపాటి గిరిప్రసాద్‌, బిడిజన అప్పారావు, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సీదరి మంగ్లన్నదొర, వంజరి సీతారం నాయుడు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అద్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బూసరి కృష్ణారావు, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్‌, పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్‌, వైస్‌ ఎంపీపీలు కుంతూరు కనకాలమ్మ, కుడుముల సత్యనారయణ, ఆనంద్‌, పలువురి ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్‌లు, నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

పాడేరు పట్టణంలో నిరసన ర్యాలీ చేపడుతున్న ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, నియోజకవర్గ పరిశీలకుడు ఏడువాక సత్యారావు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు

మాటల గారడీతో మభ్యపెట్టి.. ‘సూపర్‌’ హామీలతో బురిడీ కొట్టించి అధికార పీఠమెక్కిన చంద్రబాబు వంచన పర్వానికి రెండేళ్లు గడిచాయి. ఎన్నికల ముందు జనం ముందుకొచ్చి ఎప్పటిలాగానే ఎడాపెడా హామీలు గుప్పించిన ఆ నయవంచక బాబు.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి పాతరేసి, దోపిడీకి ఎర్ర తివాచీ పరిచారు. ఈ రెండేళ్ల మోసాల్ని తూర్పారబడుతూ ఏజెన్సీ వీధులు నిరసనజ్వాలలతో హోరెత్తాయి. సంపద సృష్టిస్తానంటూ సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్న చంద్రబాబు మోసకారి పాలనపై మన్యం భగ్గుమంది. కల్లబొల్లి కబుర్లతో కాలాన్ని నెట్టుకొస్తున్న దగాకోరు ప్రభుత్వ తీరును ఎండగడుతూ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి.

హామీలు అమలు చేసేది ఎప్పుడు?

ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేది ఎప్పుడని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో యువతను మోసం చేశారన్నారు. క్రీడా కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి, అర్హులైన అభ్యర్థులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతితో పాటు మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాలకు ఇప్పటికీ అతీగతీలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

సూపర్‌ సిక్స్‌అమలు లేనట్టేనా!

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ రాష్ట్రలో కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్‌ పేరుతో గద్దెనెక్కి రెండేళ్ళు కావస్తున్నా పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement