సాక్షి, పాడేరు: జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి గిరిజన రైతుల ఆర్థిక ప్రయోజనాలు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ విభాగాల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే ఆరు, ఏడు నెలల కాలానికి సంబంధించి చిరుధాన్యాల సాగుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వెదురు సాగును ప్రోత్సహించాలని, వచ్చే శుక్రవారంలోగా ప్రతి మండలంలో బంజరు భూములను గుర్తించాలన్నారు. 1200 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాల కిట్లను పంపిణీ చేయాలన్నారు. ఉద్యాన వనశాఖ ద్వారా పండ్ల తోటల పెంపకం, తోటల విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అరకులోయ మండలం కొత్తవలసలో ఔషధ మొక్కల పెంపకం, 30 ఎకరాల్లో పూల తోటలను సాగు చేయాలన్నారు. ముంచంగిపుట్టు ప్రాంతంలో పుట్టగొడుగులు, జీడిపప్పు ప్రోసెసింగ్ యూనిట్లు ప్రారంభించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు నందు, బాలకరణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


