బీచ్‌లో ‘రిప్ కరెంట్’ గుర్తింపునకు ఏయూ పరిశోధన
రూ.22 లక్షల ఇస్రో ప్రాజెక్ట్
ముందస్తు హెచ్చరికలతో
పర్యాటకులకు రక్షణ
విశాఖ విద్య: విశాఖ తీరంలో పర్యాటకుల భద్రత కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక కీలకమైన పరిశోధన ప్రాజెక్టును చేపట్టింది. బీచ్‌లలో అత్యంత ప్రమాదకరంగా మారే ‘రిప్ కరెంట్ల’ గుర్తింపునకు ప్రాధాన్యత ఇస్తూ ఈ అధ్యయనం సాగనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (సాక్) ఈ ప్రాజెక్టును ఏయూకు మంజూరు చేసింది. రెండేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ పరిశోధన మొత్తం వ్యయం సుమారు రూ.22 లక్షలు. సాక్ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్‌కుమార్, ఏయూ వాతావరణ–సముద్ర శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సి.వి.నాయుడు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు.
కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ సాంకేతికత
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా కృత్రిమ మేధస్సు(ఏఐ), ఉపగ్రహ సాంకేతికతను ఉపయోగించనున్నారు. సముద్ర గమనాన్ని, వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా విశాఖ తీరంలో రిప్ కరెంట్లు ఎప్పుడు, ఎక్కడ ఏర్పడతాయో ముందస్తుగానే అంచనా వేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏఐ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు.
నాలుగు సంస్థల సమన్వయం
ఈ పరిశోధన ద్వారా లభించే సమాచారం, ఫలితాలు తీర ప్రాంత భద్రతా పోలీసులు, జీవీఎంసీ, పర్యాటక శాఖ, బీచ్ నిర్వహణ సంస్థలకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రమాద సూచనలు సకాలంలో అందడం వల్ల ఆయా ప్రభుత్వ విభాగాలు వెంటనే స్పందించి నివారణ, రక్షణ చర్యలు చేపట్టే వీలుంటుంది.
పర్యాటకులకు పెరగనున్న భద్రత
ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే బీచ్‌లలో ప్రమాదవశాత్తూ మునిగిపోయే ఘటనలు, మరణాల సంఖ్య భారీగా తగ్గుతుందని ఏయూ సముద్ర శాస్త్ర విభాగాధిపతి ఆచార్య సి.వి.నాయుడు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల పట్ల పర్యాటకులకు ముందే అవగాహన కల్పించవచ్చని, తీర ప్రాంత విపత్తుల నివారణలో, ప్రజా భద్రతలో ఇదొక విప్లవాత్మక మార్పు కానుందని ఆయన స్పష్టం చేశారు.


