జేసీ ఎదుటే ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

జేసీ ఎదుటే ఆత్మహత్యాయత్నం

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

’ఒక నెల–ఒక నియోజకవర్గం’లో కలకలం!

జాయింట్‌ కలెక్టర్‌ ఎదుటే ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న బాధితుడు

తన భూమిని కొందరు

ఆక్రమించుకున్నారని మనస్తాపం

అడ్డుకున్న పోలీసులు..

నిందితుడికి కౌన్సెలింగ్‌

ఆనందపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఒక్కసారిగా రణరంగంగా మారింది. భూ కబ్జాదారుల వేధింపులతో విసిగిపోయిన ఓ బాధితుడు ఏకంగా విశాఖ జేసీ ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఆనందపురం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘ఒక నెల–ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో.. ముకుందపురం గ్రామానికి చెందిన ఓ అర్జీదారుడు తన భూమిని కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలంటూ సభలోకి దూసుకొచ్చాడు. పెద్దగా కేకలు వేస్తూ అలజడి సృష్టించిన అతడు, అంతటితో ఆగకుండా ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను శరీరంపై కుమ్మరించుకున్నాడు. జేసీతో పాటు అక్కడున్న అధికారులు షాక్‌కు గురయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు స్పందించి, అతడిని గట్టిగా పట్టుకుని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

త్వరితగతిన సమస్యల పరిష్కారం

అంతకుముందు జేసీ విద్యాధరి మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు శుక్రవారాల సందర్శనలు ముగిశాయని, ఇక సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెడతామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆనందపురం మండలం నుంచి 30 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 190 అప్లికేషన్లు అందినట్లు తహసీల్దార్‌ ఎస్‌.శ్రీనివాసబాబు వెల్లడించారు.

అలాగే పొడుగుపాలెం గ్రామస్తులు తమ ప్రాంతంలో రోడ్డు విస్తరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో విశ్వేశ్వరరావు, ఆర్డీవో సంగీత్‌ మాధుర్‌, ఆనందపురం ఎమ్‌పీడీవో వి.జానకి, భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల తహసీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement