గ్రీన్‌, హెల్తీ వైజాగ్‌ దిశగా కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌, హెల్తీ వైజాగ్‌ దిశగా కార్యాచరణ

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

రూ.10.97 కోట్లతో

60 థీమ్‌ పార్కుల అభివృద్ధి

బీచ్‌ ఫ్రంట్‌, సిటీ సైక్లింగ్‌ ట్రాక్‌లకు

ప్రతిపాదనలు

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

డాబాగార్డెన్స్‌: విశాఖ నగరాన్ని పచ్చదనం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణహిత రవాణా, వారసత్వ పరిరక్షణకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీవీఎంసీ పలు వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం, వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 174 పార్కులు ఉండగా, వాటిలో 151 ఎకరాల విస్తీర్ణంలో 139 కాలనీ పార్కులు ఉన్నాయని తెలిపారు. వీటిలో మరింత అభివృద్ధి అవసరమైన 60 పార్కులను గుర్తించి, ఆరు ప్యాకేజీలుగా విభజించి రూ.10.97 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక థీమ్‌ పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారం ‘సైక్లింగ్‌ డే’గా స్వచ్ఛందంగా పాటించాలని నిర్ణయించినట్లు కమిషనర్‌ తెలిపారు. సైక్లింగ్‌ సంస్కృతిని ప్రోత్సహించేందుకు సాగర్‌నగర్‌ బీచ్‌ సమీపంలో 10 అడుగుల వెడల్పుతో 700 మీటర్ల పొడవున బీచ్‌ ఫ్రంట్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఆరిలోవ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పరిసరాల్లో 2.70 మీటర్ల వెడల్పుతో 5.20 కిలోమీటర్ల పొడవున రూ.3 కోట్ల వ్యయంతో సిటీ సైక్లింగ్‌ ట్రాక్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement