అధికారుల
● యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా
● పాడేరు కేంద్రంగా దందా
● హింసిస్తూ తరలిసున్నా పట్టించుకోని వైనం
గుత్తులపుట్టులోని పశువుల సంత
సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. బక్రీద్ పండుగకు ముందు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు, ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో పశువుల అక్రమ వ్యాపారం జోరందుకుంది.
సంతల్లోనే అక్రమ దందా
పాడేరు మండలంలోని గుత్తులపుట్టు వారపు సంత కబేళాలకు పశువుల తరలింపు కేంద్రంగా మారింది. గురువారం జరిగిన ఈ సంతలో కబేళా వ్యాపారులు భారీగా కొనుగోళ్లు చేశారు. సుమారు రూ. 50 లక్షల విలువైన పశువుల క్రయవిక్రయాలు జరిగినట్లు సమాచారం. గిరిజన రైతులు, దళారుల నుంచి పశువులను కొనుగోలు చేసిన వ్యాపారులు, వాటిని వ్యాన్లు మరియు మినీ లారీల్లో తరలించారు. పశువులను ఎక్కించే సమయంలో కూలీలు చేస్తున్న హింసాత్మక చర్యలు పశు ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. మినీ వ్యాన్లలో సామర్థ్యానికి మించి పశువులను కుక్కి, ఘాట్ రోడ్ల గుండా తెలుగు రాష్ట్రాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు.
అధికారుల ఉదాసీనత
ప్రభుత్వం పశువుల అక్రమ తరలింపుపై నిషేధం విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అరకులోయ, పాడేరు, చింతపల్లి మండలాల మీదుగా జాతీయ రహదారికి చేరుకుంటున్న ఈ వాహనాలను తనిఖీ చేయాల్సిన పోలీస్, పశుసంవర్ధక శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లా సరిహద్దులోని తాటిపర్తి, డౌనూరు చెక్‌పోస్టుల వద్ద కూడా ఎటువంటి తనిఖీలు చేపట్టకపోవడం గమనార్హం. కేవలం మార్కెటింగ్ శాఖ మాత్రమే పశువుల వ్యాపారుల నుంచి మార్కెట్ సెస్‌ను వసూలు చేయడానికే పరిమితమైంది తప్ప, అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైంది.
రాజకీయ అండతోనే సాగుతోందా?
మైదాన ప్రాంతాలైన నక్కపల్లి, పాయకరావుపేట, తుని, కాకినాడ, రాజమండ్రి మరియు విజయవాడకు చెందిన బడా వ్యాపారులు మన్యంలో ఈ అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. వీరి వెనుక కూటమి నేతల అండ ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. స్థానిక దళారులకు అడ్వాన్స్‌లు ఇచ్చి పశువులను కొనిపిస్తూ, చెక్‌పోస్టుల వద్ద ఉన్న సంబంధిత శాఖల అధికారులకు ముడుపులు చెల్లించడం వల్లే ఈ అక్రమ రవాణా సులభంగా సాగిపోతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఏజెన్సీలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పటిష్ట నిఘాకు ఆదేశం
ఏజెన్సీ సంతలు, మైదాన ప్రాంతాల్లో పశువుల రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపడతాం. అనకాపల్లి జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులతో పాటు రాత్రిపూట కూడా పటిష్ట నిఘా ఉంచేలా సంబంధిత పోలీసు బృందాలకు కఠిన ఆదేశాలు జారీ చేశాం. – అమిత్‌బర్ధర్, ఎస్పీ, పాడేరు
తనిఖీలు శూన్యం
గుత్తులపుట్టు సంతలో పశువులను హింసించి లారీల్లో ఎక్కిస్తున్న తీరు దారుణంగా ఉంది. భారీగా అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు తనిఖీలు చేయడం లేదు.
– రంధి చిన్నయ్య,
సంత ఆశీలు నిర్వాహకుడు, గుత్తులపుట్టు


