● నాడు–నేడు పనులకు నిధుల కొరత
● సౌకర్యాల కల్పనపై ‘కూటమి’ నిర్లక్ష్యం
● నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, పాడేరు: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో, ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత విద్యాసంవత్సరంలో అనేక సమస్యల నడుమ చదువు పూర్తి చేసిన విద్యార్థులు, ఈ ఏడాది కూడా అదే పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది.
అసంపూర్తిగా మౌలిక సదుపాయాలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకం రెండో విడతలో భాగంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల పరిధిలోని 967 పాఠశాలల అభివృద్ధికి పనులు చేపట్టారు. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులకు నిధుల కొరత ఏర్పడటంతో ఆ పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఫలితంగా మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం సమగ్ర శిక్షా నిధులతో పాఠశాలల భవన నిర్మాణాలను చేపట్టినప్పటికీ, అవి కూడా పూర్తికాకపోవడంతో విద్యార్థులకు తరగతి గదుల సమస్య వెంటాడుతోంది.
అందని విద్యా కిట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పూర్తిస్థాయిలో అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. రెండు జిల్లాల పరిధిలోని 2,913 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు లక్షా 77 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసినప్పటికీ, ఇతర కిట్ల సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొంది.దాదాపు 1,77,733 మంది విద్యార్థులకు షూలు, బ్యాగులు, బెల్టులు ఇంకా అందలేదు.కేవలం 20,561 మంది విద్యార్థులకు మాత్రమే యూనిఫాం క్లాత్ చేరింది. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు కూడా సరఫరా కాలేదు. స్కూల్ ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలతో పాటు అన్ని కిట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఆ మాటలు కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు కిట్లు అందేవని, కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలల వివరాలు
ప్రాథమిక : 2,551
ప్రాథమికోన్నత : 91
ఉన్నత : 271
మొత్తం : 2,913
విద్యార్థుల సంఖ్య : 1,77,733


