● ఎస్పీ అమిత్‌బర్దర్
● పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష
పాడేరు: జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖలోని అన్ని విభాగాల సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, బాధితులకు తక్షణ సహాయం అందేలా చూసి, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం కఠినంగా వ్యవహరించాలని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన డ్రగ్ డిటెక్షన్ కిట్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వంటి సాంకేతిక పరికరాల ద్వారా నిఘాను పటిష్టం చేయాలన్నారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గిరిజన గ్రామాల్లో మహిళా భద్రత, సైబర్ నేరాలు, బాలికల రక్షణ, ‘శక్తి’ యాప్ వినియోగం, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, అలాగే రాత్రిపూట గస్తీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసుల దర్యాప్తు, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ, నేరాల ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్పీ నగదు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఈగల్ టీమ్ అధికారులు పాల్గొన్నారు.


