జిల్లా అధికారి సుజాత
చింతపల్లి: జిల్లాలో మలేరియా జ్వరాలు ప్రబలకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు చేపడుతున్నామని జిల్లా మలేరియా అధికారిణి సుజాత తెలిపారు. గురువారం ఆమె స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించి, ల్యాబ్‌లో మలేరియా రికార్డులను పరిశీలించారు. అనంతరం వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల నేపథ్యంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, మొదటి విడతగా జిల్లాలోని 1,604 గ్రామాల్లో మలేరియా స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 890 మలేరియా కేసులు నమోదయ్యాయని, రెండు మరణాలు సంభవించాయని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా అనంతగిరి, పాడేరు, కొయ్యూరు, గూడెం కొత్తవీధి మండలాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ కిట్లు, అవసరమైన మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. గ్రామాల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశామని ఆమె తెలిపారు. ఆరోగ్య కేంద్రాల నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి, చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న రోగుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ, వారికి తక్షణ వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నామని సుజాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సబ్ యూనిట్ అధికారి చిట్టిబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


