ముంచంగిపుట్టు : మండలంలోని సుజనకోట పంచాయతీ పరిధిలోని కుమ్మరిపుట్టు మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణానికి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు బుధవారం స్థల పరిశీలన నిర్వహించారు. కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నాటు పడవల ద్వారా ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని సుజనకోట మాజీ సర్పంచ్ వెంగడ రమేష్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్‌కు వంతెన నిర్మాణానికి సంబంధించిన నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్, ఏఈ రాయుడు కుమ్మరిపుట్టు మత్స్యగెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. వంతెన నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించి కొలతలు తీసుకున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజనుల నుంచి అవసరమైన వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఈఈ వేణుగోపాల్ మాట్లాడుతూ, కుమ్మరిపుట్టు మత్స్య గెడ్డపై వంతెన నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలి భర్త దామోదరం, గ్రామస్తులు కృష్ణ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


