● జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ
● పీజీఆర్‌ఎస్‌లో 255 అర్జీలు స్వీకరణ
ముంచంగిపుట్టు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ హాజరై ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను జేసీకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుండి మొత్తం 255 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారితనం ముఖ్యమని, నిర్దేశించిన గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల సమస్య పరిష్కారం కాకపోతే, ఆ విషయాన్ని స్పష్టంగా అర్జీదారుడికి తెలియజేయాలన్నారు. ఒకే సమస్యపై అర్జీలు పదేపదే వస్తే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రోడ్లు, తాగునీరు, ఆరోగ్యం, ఇరిగేషన్, గిరిజన సంక్షేమం, పీఆర్, రెవెన్యూ, సీసీ రోడ్లు, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, మత్స్యశాఖ, పింఛన్లు, విద్యుత్, భూ సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు వచ్చాయి. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో భాగంగానే ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి 38 మందికి వైద్య సేవలు అందించారు. అలాగే ఉచిత ఆధార్ నమోదు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, జిల్లా పంచాయతీ విస్తరణ అధికారి పీఎస్‌కుమార్, డీఎంహెచ్‌వో నాయక్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, సీఐ లక్ష్మణరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్, హౌసింగ్ డీఈ రాజుబాబు, ఎంపీడీవో ధర్మారావు, ఎంఈవో కృష్ణమూర్తి, పీఆర్ ఏఈ మురళీకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్, ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ, ఏటీడబ్ల్యూవో స్వర్ణలత, సీడీపీవో విమలకుమారి పాల్గొన్నారు.


