టెట్ నుంచి ఉపశమనం కల్పించాలి
కశింకోట: టెట్ ఉత్తీర్ణత నుంచి 2010 కంటే ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకట సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జీవీఎంసీ మెయిన్ స్కూల్లో సంఘం జిల్లా అభ్యాస వర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. అభ్యాస వర్గ జిల్లా అధ్యక్షుడు మడ్డు చంద్రరావు అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల జీవితాల్లో ఆందోళన కలిగించిన టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పార్లమెంట్‌లో శాసనం ద్వారా మార్పు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ఉత్తీర్ణత నియమం ఉపసంహరణ కోరుతూ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా పాల్గొనాలని కోరారు. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. సంఘ రాష్ట్ర అదనపు కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పాఠశాలలను బేసిక్ ప్రైమరీ స్కూలుగా మార్పు చేసి ఫౌండేషన్ పాఠశాల వ్యవస్థను తొలగించాలన్నారు. సెమిస్టర్ 1 పాఠ్య పుస్తకాలను పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు అందజేయాలన్నారు.


