సాక్షి,పాడేరు: పట్టణంలోని ప్రధాన రోడ్లు, జంక్షన్లు, అన్ని వీధుల్లో వీధి లైట్ల ఏర్పాటు పనుల్లో మేజర్ పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 9న సాక్షిలో ప్రచురితమైన ‘చిమ్మ చీకట్లు... జనానికి ఇక్కట్లు’ అనే కథనానికి జిల్లా పంచాయతీ అధికారులు సానుకూలంగా స్పందించారు. పాడేరు పట్టణంలోని అన్ని వీధి స్తంభాలకు రెండు రోజుల్లోగా లైట్లు ఏర్పాటు చేసి, విద్యుత్ వెలుగులతో ప్రజల ఇబ్బందులను తొలగించాలని డీపీవో చంద్రశేఖర్, డీఎల్పీవో పీఎస్ కుమార్ స్థానిక పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా వీధి లైట్ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం సాయంత్రానికి అన్ని వీధుల్లోని స్తంభాలకు లైట్లు ఏర్పాటు పూర్తి అవుతుందని పంచాయతీ అధికారులు తెలిపారు.
నిందితుడు రౌతు మల్లేష్‌పై పీడీ యాక్టు
నర్సీపట్నం: శాంతిభద్రతలకు విఘాతం కలిస్తూ, తరుచూ నేరాలకు పాల్పడుతున్న నర్సీపట్నంకు చెందిన నిందితుడు రౌతు మల్లేష్(45)పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీడీ యాక్టు నమోదు చేసి, అరెస్ట్ చేసి విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించామని టౌన్ సీఐ గపూర్ తెలిపారు. మల్లేష్ అనేక సంవత్సరాలుగా ఇంటి దొంగతనాలు, నార్కోటిక్స్ కేసులు, హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడరన్నారు. జిల్లాలో ఇతర జిల్లాల్లో సుమారు వందకుపైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. అతని నిరంతర నేర కార్యకలాపాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


