చింతపల్లి: రెవెన్యూ శాఖ చేపడుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారి సమక్షంలోనే చేపట్టాలని ఎంపీపీ కోరాబు అనూషదేవి డిమాండ్ చేశారు. మంగళవారం కిటుమలు పంచాయతీ పరిధిలోని రాచపనుకు గ్రామంలో జరిగిన భూ హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేసి ఇస్తోందే తప్ప, కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే ప్రక్రియలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దేశంలోనే రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ధ్యేయంతో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ రీసర్వే వ్యవస్థను తొలిసారిగా తీసుకువచ్చారని గుర్తుచేశారు. పొలాల వద్ద రైతులు లేని సమయంలో అధికారులు ఏకపక్షంగా రీసర్వే చేపడితే హద్దులు మారే అవకాశం ఉందదన్నారు. దీనివల్ల రైతులు తమ భూములను నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే లోపాల వల్ల తలెత్తే సమస్యల పరిష్కారం కోసం రైతులు మళ్లీ ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించవద్దని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు న్యాయం చేసే దిశగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్. త్రివేణి, సర్వే డీటీ బాలరాజు దొర, రెవెన్యూ సిబ్బంది, రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
చింతపల్లి ఎంపీపీ
కోరాబు అనూషదేవి డిమాండ్


