గిరిజనులను కించపరిచేలా ‘పెద్ది’ సినిమాలో పదజాలం | - | Sakshi
Sakshi News home page

గిరిజనులను కించపరిచేలా ‘పెద్ది’ సినిమాలో పదజాలం

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

దర్శక, నిర్మాతలపైగిరిజన సంఘాలు ఫిర్యాదు

ఎట్రాసిటీ కేసుకు డిమాండ్‌

చింతపల్లి: ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో గిరిజన జాతిని కించపరిచేలా ఉన్న పదాలకు బాధ్యులను చేస్తూ ఆ చిత్ర దర్శక, నిర్మాతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాకు వారు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏపీ జేఏసీ జిల్లా నాయకులు దేపూరి శివకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ది సినిమాలో వాడిన కొన్ని పదాలు, సంభాషణలు గిరిజనుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ సినిమాలో గిరిజనులను ఉద్దేశించి ‘కొండ నా....’ అని తిట్టడం, అలాగే కాళ్లు పట్టుకోవడం.. వంటి సన్నివేశాలను చిత్రీకరించడం గిరిజన సమాజాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద పదాలపై సెన్సార్‌ బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని, ఆ సంభాషణలను సినిమా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు గాను ఈ సినిమా డైరెక్టర్‌, నిర్మాత, రచయితలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సాగిన కోటిబాబు, చింతర్ల మధుబాబు, ట్రైబల్‌ శక్తి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కంఠా బాలకృష్ణ, దేపూరి సునీల్‌ కుమార్‌, రీమల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement