అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు వ్యాపారుల దోపిడీతో గిరిజన జీడి రైతులు లబోదిబోమంటున్నారు. గత కొన్ని నెలలుగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు జీడి పంట తీవ్రంగా దెబ్బతింది. పిక్కలు నాణ్యత కోల్పోవడంతో గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరలకే కొనుగోలు చేస్తూ, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.
ముంచంగిపుట్టు: గిరిజన ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కురిసిన అకాల వర్షాలు జీడి పిక్కల పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వడగండ్ల వానలు, ఈదురు గాలుల కారణంగా జీడి పిందెలు, పిక్కలు చెట్టు నుంచే రాలిపోయాయి. దీనికి తోడు తేమ కారణంగా జీడి పిక్కలు పూర్తిగా నాణ్యత లోపించాయి. ఫలితంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జీడి పిక్కల ధరలు భారీగా పడిపోయాయి. ఈ పరిస్థితిని ప్రైవేట్ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత ఏడాది కిలో జీడి పిక్కల ధర రూ. 160 నుంచి రూ. 180 వరకు పలకగా, ఈ ఏడాది ప్రారంభంలోనే రూ. 120కు పడిపోయింది. ప్రస్తుతం వ్యాపారులు రూ. 140 లోపే ధర నిర్ణయిస్తూ గిరిజన రైతుల పొట్ట కొడుతున్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులు ఆశించిన మద్దతు ధరతో కొనుగోలు చేయకపోవడంతో గిరిజన జీడి రైతుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. వారపు సంతల్లో సైతం ప్రైవేట్ వ్యాపారుల హవా నడుస్తోంది.
తప్పని ఆవేదన
ఉద్యానవన శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో సుమారు 18,349 ఎకరాల్లో జీడి తోటలు విస్తరించి ఉన్నాయి. దీని ద్వారా సాధారణంగా 12 వేల టన్నులకు పైగా జీడి దిగుబడి రావాల్సి ఉంది. కానీ, గత రెండు నెలలుగా మన్యంలో కురిసిన విస్తారమైన వర్షాల వల్ల జీడి పిక్కలు అధికంగా నేలపాలయ్యాయి. దీంతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు సంతల్లో కాకుండా నేరుగా గిరిజన గ్రామాల్లోని రైతుల వద్దకే వెళ్లి జీడి పిక్కలను కొనుగోలు చేస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, పంట చేతికి రాకముందే అడ్వాన్సులు ఇచ్చి, తూకాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు.
గత ఐదేళ్లలో ఇదే అత్యంత కనిష్ట ధర
ప్రతి ఏడాది జీడి పిక్కలకు రూ. 150 నుంచి రూ. 180కు పైగా ధర లభించేది. కానీ, ఈ ఏడాది వ్యాపారులు కేవలం రూ. 110 నుంచి రూ. 140 వరకు మాత్రమే ఇస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదు.. అని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారపు సంతల్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి, తమకు నచ్చిన ధరనే నిర్ణయిస్తూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోతే, మరోవైపు వ్యాపారుల సిండికేట్ వల్ల మద్దతు ధర దక్కక గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు.
వ్యాపారుల దోపిడీతో నష్టం
వర్షాల వల్ల జీడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. పిక్కలపై నల్లమచ్చలు రావడంతో మార్కెట్లో ధర పూర్తిగా పడిపోయింది. ప్రతి ఏడాది గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకునే ఏకై క పంట జీడి. కానీ ఈ ఏడాది అటు దిగుబడి లేక, ఇటు ధర రాక గిరిజన రైతులు రెండు విధాలా అన్యాయానికి గురవుతున్నారు. వ్యాపారులు సైతం సిండికేట్‌గా మారి తమకు నచ్చినట్లు ధరలు నిర్ణయిస్తూ, తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
– ఎం.ఎం. శ్రీను, మండల అధ్యక్షుడు,
గిరిజన సంఘం, ముంచంగిపుట్టు
నాణ్యత లోపించి,
నల్లమచ్చలు వచ్చాయి
ఈ ఏడాది జీడి పంట మేము ఆశించినంత దిగుబడి రాలేదు. దీనికి ముఖ్య కారణం అకాలంగా విస్తరంగా కురిసిన వర్షాలే. వర్షాల వల్ల జీడి పిక్కలు పూర్తిగా నాణ్యత కోల్పోయాయి. పిక్కలపై నల్లమచ్చలు అధికంగా వచ్చాయి. దీనికి తోడు వారపు సంతల్లో జీడి పిక్కల ధర సైతం ఎన్నడూ లేని విధంగా అతి తక్కువగా పలుకుతోంది. వ్యాపారులు చాలా తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో మేము తీవ్రంగా నష్టపోతున్నాం.
– వి. రామో, గిరిజన జీడి రైతు,
వనుగుపుట్టు, ముంచంగిపుట్టు మండలం
అటు ప్రకృతి కన్నెర్ర
ఇటు వ్యాపారుల దోపిడీ!
అకాల వర్షాలతో నల్లబడిన పిక్కలు
ఐదేళ్లలో ఇదే అత్యంత కనిష్ట ధర!
సంతల్లో వ్యాపారుల సిండికేట్
తూకాల్లోనూ నిలువు దోపిడీ
పట్టించుకోని జీసీసీ


