వైభవంగా అప్పన్న సహస్ర నామార్చన | - | Sakshi
Sakshi News home page

వైభవంగా అప్పన్న సహస్ర నామార్చన

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని స్థానిక రామాలయ ప్రాంగణంలో ఆదివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సహస్ర నామార్చన పూజ అత్యంత వైభవంగా జరిగింది. సింహాచలంలోని ప్రముఖ ’సింహాద్రి మఠం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విశేష పూజా కార్యక్రమంలో చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల అప్పన్న నామస్మరణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్సవాల కోసం వేదికపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నమూనా విగ్రహాన్ని అందంగా అలంకరించి ప్రతిష్టించారు. సింహాచలం దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, సింహాద్రి మఠం గురుస్వాములు కశిరెడ్డి సురేంద్రస్వామి, అప్పారావుస్వామిల పర్యవేక్షణలో అర్చక బృందం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు

ఉదయం నుంచే భక్తులకు స్వామివారి అనుగ్రహం కలిగేలా వరుసగా ఆశీర్వచనాలను అందజేశారు. పూజలో భాగంగా మొదట విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మండపారాధనలను వైభవంగా జరిపారు. అనంతరం 1001 దివ్య నామాలతో స్వామివారికి భక్తిశ్రద్ధలతో సహస్ర నామార్చన పూర్తి చేసి, విశేష హారతులు సమర్పించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి చిత్రపటాలను, పూజా సామగ్రిని నిర్వాహకులు ఉచితంగా పంపిణీ చేశారు. పూజా కార్యక్రమాలు అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమ విజయవంతానికి మండల పరిధికి చెందిన స్వాములు దొన్నొ, సత్యం, కర్రిబాబు, వెంకటలక్ష్మి, అతీరామ్‌, సీతారామ్‌, ఎంపీటీసీ భర్త దామోదరం తదితరులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పెద్ద ఎత్తున తరలివచ్చిన గిరిజన భక్తులు ఘనంగా అన్నసమారాధన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement