వైభవంగా మోదమ్మ ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మోదమ్మ ఉత్సవాలు ప్రారంభం

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

పాదాల గుడికి తరలివచ్చిన భక్తజనం

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి

ఘటాల సమర్పణ

సాక్షి, పాడేరు: భక్తుల ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మతల్లి ఉత్సవాలు ఆదివారం పలు గ్రామాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పాడేరు ఘాట్‌ రోడ్డులోని మోదమ్మ పాదాల గుడి వద్ద మూడేళ్లకు ఒకసారి జరిగే అమ్మవారి జాతరను జన్ని కుటుంబ సభ్యులు, మోదాపల్లి పంచాయతీ గిరిజనులు ఘనంగా ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవాల ప్రారంభంతో ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి, ఇంటి పండగను జరుపుకున్నారు. భక్తులు మోదమ్మకు ఘటాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. పాదాల గుడి ఆవరణతో పాటు పరిసరాల్లోని కాఫీ తోటల్లో భక్తులంతా వంటావార్పులు చేస్తూ సందడి చేశారు. జాతరకు వచ్చిన భక్తులకు జన్ని కుటుంబం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. పాదాల గుడితో పాటు నక్కలపుట్టు, తుంపాడ, గుత్తులపుట్టు గ్రామాల్లోనూ మోదకొండమ్మతల్లి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, పాదాలు, ఘటాలను గ్రామాల్లో ఊరేగించి, సతకం పట్టు వద్ద ప్రతిష్టించారు. ఆయా గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు మోదమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం జరగబోయే ప్రధాన ఊరేగింపు సంబరాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నక్కలపుట్టులోని మోదకొండమ్మతల్లి ఆలయాన్ని మాజీమంత్రి బాలరాజు సందర్శించారు. సతకం పట్టు వద్ద కొలువుదీరిన మోదమ్మ ఉత్సవ విగ్రహాలను, పాదాలను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు శరభ సూర్యనారాయణ, మండల నాయకులు పాంగి నాగరాజు, బోద నారాయణ, పాడేరు వర్తక సంఘం నాయకులు ఉడా త్రినాథ్‌ పాల్గొన్నారు.

నక్కలపుట్టులో ఘటాలను ఊరేగిస్తున్న భక్తులు, ఘటాలను దర్శించుకున్న మాజీ మంత్రి బాలరాజు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement