● రెవెన్యూ అధికారుల
అండతో భూఆక్రమణలు
● మాజీ మంత్రి
పసుపులేటి బాలరాజు ధ్వజం
పాడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల కూటమి పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఒక్క కొత్త పథకం కూడా రాలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పసుపులేటి బాలరాజు విమర్శించారు. ఆదివారం పాడేరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జీవో నెంబర్ 3 కోల్పోయి గిరిజన యువత నిరుద్యోగంతో సతమతమవుతుంటే, అల్లూరి జిల్లాను జోన్–2 పరిధిలోకి చేర్చి ఉద్యోగాలు, బదిలీల్లో ప్రభుత్వం మరింత అన్యాయం చేసిందని మండిపడ్డారు. జిల్లాలో స్థానిక కాఫీ, అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు నెలకొల్పకుండా, గిరిజనులకు నష్టం చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం వందలాది ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఇస్తున్నారని ఆరోపించారు. స్థానికులు చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి కూడా సెంటు భూమి ఇవ్వడం లేదని నిలదీశారు.జిల్లా వ్యాప్తంగా రెండేళ్లుగా అధికారుల అవినీతి హెచ్చుమీరిందని బాలరాజు ఆరోపించారు. పాడేరు పట్టణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరోధించే బోర్డులను రాత్రికి రాత్రే తొలగిస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని, అమాయక గిరిజనుల భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. మట్టి, ఇసుక, రాయి తరలింపుల్లో అధికారుల చేతివాటం మితిమీరినా జిల్లా అధికారుల నియంత్రణ కరువైందన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాయని, ఇటీవల తానే స్వయంగా పాడేరులో రూ.1,400 పెట్టి సిలిండర్ కొనాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నా, కొంతమంది జిల్లా అధికారుల ద్వంద్వ వైఖరి వల్ల రోడ్ల విస్తరణ పనులు జరగడం లేదన్నారు. ఒక మాజీ మంత్రిగా అభివృద్ధి పనుల వివరాలు అడిగితే ఇవ్వడానికి కూడా అధికారులు వెనుకాడుతున్నారన్నారు. అధికార యంత్రాంగం, పాలకులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని ఆరోపించారు. గిరిజన సమస్యలపై త్వరలోనే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం అని బాలరాజు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు శరభ సూర్యనారాయణ, నాయకులు పాంగి నాగరాజు, బోధా నారాయణ తదితరులు పాల్గొన్నారు.


