సీలేరు: జూన్ మొదటి వారం ముగుస్తున్నా, రుతుపవనాలు సమీపిస్తున్నా మన్యంలో ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. మే నెల తరహాలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం సీలేరు పరిసర ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బకు జనం అల్లాడిపోయారు. ఆదివారం జరిగిన సీలేరు, దారకొండ వారసంతలకు మారుమూల గ్రామాల నుంచి వచ్చిన గిరిజన రైతులు, వ్యాపారులు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గొడుగులు ఆసరాగా చేసుకొని, దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని వ్యాపారాలు సాగించారు. ఎండ తట్టుకోలేక చాలామంది శీతల పానీయాల వైపు మొగ్గు చూపారు. సంతలకు కాలినడకన వచ్చిన గిరిజనులు తలకు వస్త్రాలు చుట్టుకుని కనిపించారు. తీవ్రమైన ఎండల కారణంగా మధ్యాహ్నం వేళ జనసంచారం లేకపోవడంతో ఆటోలు, ఇతర వాహనదారులు రోడ్డు పక్కనే వాహనాలు నిలుపుకోవాల్సి వచ్చింది. మన్యంలోని మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నప్పటికీ, సీలేరులో మాత్రం చినుకు పడకపోవడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు


