‘పెద్ది’లో ఆదివాసీలను కించపరిచే దృశ్యాలు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

‘పెద్ది’లో ఆదివాసీలను కించపరిచే దృశ్యాలు తొలగించాలి

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి

గిరిజన సంఘాల డిమాండ్‌

పాడేరు: ఇటీవల విడుదలైన పెద్ది చలనచిత్రంలో ఆదివాసీ సమాజాన్ని, గిరిజనులను ఉద్దేశించి అత్యంత హీనంగా, కించపరిచే విధంగా చిత్రీకరించిన దృశ్యాలను, సంభాషణలను తక్షణమే తొలగించాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు మసాడ ఈశ్వరరావు, సీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మోరి మోహన్‌, ప్రధాన కార్యదర్శి సాగిన వెంకటరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం పాడేరులో వారు విలేకరులతో మాట్లాడారు. సినిమాలో వివాదాస్పద సీన్లను తొలగించడంతో పాటు హీరో, దర్శకుడు, చిత్ర యూనిట్‌ అంతా గిరిజన సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆదివాసీ సమాజం మొత్తాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సినిమాల్లో సమాజంలోని ఒక నిర్దిష్ట జాతిని అత్యంత అవమానకరంగా కించపరచడం, హేళన చేస్తూ మాట్లాడటం చట్టరీత్యా నేరమని వారు స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సినిమా సెన్సార్‌ బోర్డుకు ఈ వివాదాస్పద దృశ్యాలు ఎందుకు కనిపించలేదని వారు ప్రశ్నించారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఆ సీన్లను తక్షణమే తొలగించాల్సిందేనని వారు పట్టుబట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement