గూడెంకొత్తవీధి: మండల పరిధిలోని రింతాడ పంచాయతీ కడుగుల గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు స్వయంకృషితో స్థానిక ప్రభుత్వ పాఠశాల చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు, బడి సమయాల్లోనూ పశువులు, ఇతర జంతువులు పాఠశాల ఆవరణలోకి వచ్చేవి. అలాగే విద్యార్థులు తరగతులు జరుగుతున్న సమయంలో బయటకు వెళ్లే ప్రమాదం కూడా ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించిన గ్రామస్తులంతా ఏకమయ్యారు. అధికారుల నిధుల కోసం ఎదురుచూడకుండా తామే శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అడవి నుంచి వెదురు బొంగులు, గట్టి కర్రలను సేకరించి తీసుకువచ్చారు. పాఠశాల చుట్టూ పటిష్టమైన కంచెను నిర్మించడంతో పాటు, రాకపోకల నియంత్రణ కోసం ఒక గేటును కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్తులు చూపిన ఈ చొరవను, పాఠశాల పట్ల వారికున్న బాధ్యతను పలువురు అభినందిస్తున్నారు.
కడుగుల గ్రామస్తుల ఆదర్శం


