స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల దాడులు

Special Branch police raids on Cattle smuggling - Sakshi

విజయనగరం టౌన్‌: స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ విభాగం వారు ఎస్పీ జి.పాలరాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఖైనీ, గుట్కా, పశువుల అక్రమ రవాణాదారులపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఎస్పీ సోమవారం వివరాలు వెల్లడించారు. దాడుల్లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ సురేంద్రనాయుడు, కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ ఏఎస్‌ఐ జోగారావు, జానీ, హుస్సేన్, శ్రీను, రాజశేఖర్, కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

దాడుల వివరాలు..
స్పెషల్‌ బ్రాంచ్‌ ప్రత్యేక విభాగం ఆదివారం రాత్రి కలెక్టరేట్‌ సమీపంలో రెండు టాటా గూడ్స్‌ వాహనాల్లో తరలిస్తున్న 27 పశువుల మాంసాన్ని పట్టుకుని వన్‌టౌన్‌ పోలీసులకు తదుపరి చర్యల నిమిత్తం అప్పగించారు.

నెల్లిమర్ల మండలం జరజాపుపేట గ్రామంలో ఖైనీ, గుట్కా, సిగిరెట్లను అక్రమంగా విక్రయిస్తున్న నాగుల భాస్కరారవును స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆయన నుంచి రూ.5 లక్షల విలువైన నిషేధిత సరుకును స్వాధీనం చేసుకుని, నెల్లిమర్ల పోలీసులకు అప్పగించారు.

పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.60 వేల విలువైన ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకుని పేర్ల త్రినాధ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు.

పట్టణంలోని పుచ్చలవీధిలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి పతివాడ పైడిరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, రూ.10 వేల విలువైన  ఖైనీ,గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ని టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు.

జామి మండలం అలమండ సంత సమీపంలో ఏపీ 24 టీసీ 4918 వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 12 ఆవులను, ఆరు లేగ దూడలను స్వాధీనం చేసుకుని, తెలంగాణలోని భువనగిరికి చెందిన బండ శ్రీధర్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని జామి పోలీసులకు అప్పగించారు.

పార్వతీపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పార్వతీపురం, కొమరాడ మండలంలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి, 11 మందిని అదుపులోనికి తీసుకుని వారి నుంచి రూ.32 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం పార్వతీపురం రూరల్‌ పోలీసులకు వారిని అప్పగించారు.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top