పూంఛ్, రాజౌరి జిల్లాల్లో పాక్ దళాలు మూడుసార్లు కాల్పులకు తెగబడ్డాయి.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్థాన్కు అలవాటుగా మారిపోయింది. శనివారం పూంఛ్, రాజౌరి జిల్లాల్లో మూడుసార్లు కాల్పులకు తెగబడింది. నియంత్రణ రేఖ వెంబడి మెంధార్ వద్ద భారతీయ సైనిక శిబిరాలపై ఎలాంటి కవ్వింపు లేకుండానే పాక్ దళాలు కాల్పులు జరిపాయని రక్షణశాఖ అధికార ప్రతినిధి కర్నల్ ఆర్కే పాల్టా తెలిపారు. అలాగే, రాజౌరి జిల్లాలోని బాలాకోట్ ప్రాంతంలో రాత్రి 10.30 గంటల వరకు కాల్పులు కొనసాగాయని చెప్పారు.
త్రికుండి గలి, బాలాకోట్ ప్రాంతాల్లో శనివారం నాడు పాకిస్థాన్ కాల్పులకు పాల్పడింది. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఎలాంటి కాల్పులు ఉండకూడదంటూ 2003 నవంబర్ నెలలో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి కుదిరింది. కానీ, దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండానే పాక్ దళాలు పదే పదే కాల్పులకు పాల్పడుతూ ఉన్నాయి. నియంత్రణ రేఖ వద్ద, జమ్ము కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ దళాలు కాల్పులకు పాల్పడుతున్నట్లు భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి.